కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది

27 Nov, 2020 12:09 IST|Sakshi

దిశ సంఘటనకు నేటికి ఏడాది

సంచలనం సృష్టించిన నిందితుల ఎన్‌కౌంటర్‌

మహిళల రక్షణ దిశగా.. చట్టంలోను పలు మార్పులు

సాక్షి, షాద్‌నగర్‌ : ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది... ఓ అమ్మాయి పట్ల జరిగిన దారుణ మారణ కాండ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది.. దిశ ఉదంతం.. మహిళ రక్షణ దిశగా పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్‌ శివారులలో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికి ఏడాది అయ్యింది. ప్రతి ఒక్కరినీ కదిలించి కన్నీటితో ముంచిన ఈ ఘటన తరువాత జరిగిన పరిణామాలను ఓసారి నెమరేసుకుంటే.. 

  •  2019 నవంబర్‌ 27న 
    సుమారు 8.30 గంటల ప్రాంతంలో అత్యవసర పరిస్దితుల్లో స్కూటీని  శంషాబాద్‌ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన  ఆపి పని మీద వెళ్ళిన దిశ నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చిన దిశ తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. ఆ సమయంలో ఆ నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఓ పాడు పడిన ప్రహరి పక్కకు తీసుకెళ్ళి దారుణంగా సామూహిక అత్యాచారం జరిపారు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రాణాలను సైతం బలితీసుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి బైపాస్‌ వంతెన కింద దహనం చేశారు. డిసెంబర్‌ 28న  తెల్లవారే సరికి దిశ పట్ల జరిగిన దారుణం నలుదిశలా పాకింది. ఈ దారుణం ప్రతి గుండెను కదిలించింది. ఆ రోజు రాత్రే నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (దిశ.. కొత్త దశ)
     
  • ఎన్నో మలుపులు 
    దిశ హత్యోదంతం తర్వాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. నిందితులను పోలీసులు నవంబర్‌ 29న షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకరావడంతో ఇక్కడే వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని వేలాది మంది జనం పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నాను నిర్వహించారు. పోలీసుల పైకి ఆందోళన కారులు రాళ్లురువ్వడం, చెప్పులు విసరడంతో లాఠీ చార్జీ జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదేరోజు నిందితులను తహిసీల్దార్‌ ఎదుట హాజరు పర్చారు. దీంతో 14రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో పోలీసులు నిందితులను భారీ బందోబస్తు మధ్య షాద్‌నగర్‌ నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. 
  • డిసెంబర్‌ 2న నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు షాద్‌నగర్‌ కోర్టులో ఫిటీషన్‌ దాఖలు చేశారు. డిసెంబర్‌ 3న కోర్టు పదిరోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. 
  • హంతకులు ఉపయోగించిన లారీలో కీలమైన ఆధారాలను డిసెంబర్‌ 5న సేకరించారు. షాద్‌నగర్‌ డిపో ఆవరణలో ఉంచిన లారీలో క్లూస్‌టీం బృందం ఆధారాలను సేకరించింది. 
  • డిసెంబర్‌ 6వ తేదీ తెల్లవారు జామున  నలుగురు నిందితులను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. దీంతో నిందితులు పోలీసుల పైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు. నలుగురు నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
  • డిసెంబర్‌ 7న ఢిల్లీ నుండి మానవహక్కుల కమీషన్‌ బృందం దిశను ఆహుతి చేసిన ప్రాంతాన్ని, నిందితులు ఎన్‌కౌంటర్‌ జరిగిన స్ధలాన్ని పరిశీలించారు. 
  • డిసెంబర్‌ 9న దిశనను హతమార్చిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశాన్ని క్లూస్‌టీం 3డీ స్కానర్‌తో చిత్రీకరించింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన క్లూస్‌టీం బృందం చటాన్‌పల్లి బ్రిడ్డి వద్దకు చేరుకొని పరిశీలించారు. దిశను దహనం చేసిన ప్రదేశంతో పాటుగా, హంతకులను ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశాన్ని పూర్తిగా 3డీ స్కానర్‌తో చిత్రీకరించారు
  • డిసెంబర్‌ 11,15 తేదీల్లో క్లూంటీం బృంందాలు ఎన్‌కౌంటర్‌ ఘటనా స్ధలానికి వచ్చి మరిన్ని ఆధారాల కోసం వెతుకులాడాడు.
  • డిసెంబర్‌ 23న ఎన్‌కౌంటర్‌కు గురైన మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్‌ సిర్పూకర్‌ సీబీఐ మాజీ డైరక్టర్‌ కార్తీకేయన్, వీఎన్‌ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో  త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ నిమిత్తం గత జనవరిలో హైదరాబాద్‌కు వచ్చారు. (వారిని ఏ తుపాకీతో కాల్చారు?)

  • చట్టాలకు దిశ
    జాతీయ రహదారి పై టోల్‌ గేట్‌కు కూత వేటు దూరంలో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాలుగా మారింది. పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ నేపధ్యంలోనే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ మహిళ రక్షణ దిశగా పోలీసులు కొత్త అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగ రిత్యా బయటికి వెళ్లే మహిళల స్వీయ రక్షణ కోసం యాప్‌లు ఏర్పాటు చేయడం, కళాశాలల్లో మహిళా రక్షణ దిశగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకరావడం మహిళల నుండి పిర్యాదులు వస్తే వెంటనే స్వీకరించడం, వెంటనే దర్యాప్తు ప్రారంభించడం వంటి కార్యక్రమాలను విసృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు.

    మరో వైపు పోలీసుల అప్రమత్తత దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ల ప్రభావం కారణంగా ఏడాది కాలంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అయితే మహిళలు కూడ ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో  బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర పరిస్ధితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్ధించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు

మరిన్ని వార్తలు