అద్దెకున్న మహిళే హంతకురాలు

12 Oct, 2021 19:06 IST|Sakshi
ఎస్పీ చేతులమీదుగా ప్రశంస పత్రం  అందుకుంటున్న ఒంగోలు రూరల్‌ సీఐ రాంబాబు, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు

మర్రిచెట్లపాలెం మహిళ హత్య కేసులో నిందితులు అరెస్టు 

48 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు   

ఆమె హత్యకు గతంలో రెండుసార్లు విఫలయత్నం  

వివరాలు వెల్లడించిన ఎస్పీ మలికా గర్గ్‌ 

సాక్షి, ఒంగోలు: చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలేనికి చెందిన మేదరమెట్ల సీతారావమ్మ దారుణ హత్య కేసులో నిందితులను 48 గంటల్లోనే అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్‌ వెల్లడించారు. మృతురాలి దుకాణం అద్దెకు తీసుకున్న మహిళే ప్రధాన నిందితురాలని తెలిపారు. ఘటనా స్థలంలో ఎటువంటి క్లూలు లేకపోయినా అధికారులు, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితులను గుర్తించారని పేర్కొంటూ నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహిళ హత్య కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు.  
 
దర్శి మండలం రామచంద్రాపురానికి చెందిన రేగటి రమాదేవి ఐదు నెలల క్రితం మర్రిచెట్లపాలేనికి వచ్చి సీతారావమ్మ బడ్డీకొట్టును నెలకు రూ.6 వేలకు అద్దెకు తీసుకుని హోటల్‌ ప్రారంభించింది. రమాదేవి కుమారుడు పవన్‌ నూడుల్స్‌ బండి పెట్టుకుని రోజుకు రూ.100 అద్దె చెల్లిస్తానని చెప్పాడు. 4 నెలలకు పైగా కాలానికిగాను రూ.38 వేలు సీతారావమ్మకు చెల్లించాల్సి ఉండగా రూ.13 వేలు మాత్రమే చెల్లించారు. ఈ క్రమంలో బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.60 వేలు, స్థానికంగా పూలకొట్టు నిర్వహించే మహిళ వద్ద రూ.5 వేలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేకపోపోయారు. నెల క్రితం సీతారావమ్మకు చెప్పకుండా దుకాణం ఖాళీ చేశారు. 15 రోజుల తర్వాత అద్దెకు ఉంటున్న తూబట్ల అంజిరెడ్డి ఇంటికి వచ్చి సామాన్లు తీసుకెళ్లేందుకు యత్నించగా బాకీ చెల్లించాలని అప్పులవాళ్లు తేల్చిచెప్పారు.

చదవండి: (నిరుద్యోగులను ముంచేసిన మహిళా హోంగార్డు)

ఆర్థిక బాధల నుంచి బయటపడేందుకు సీతారావమ్మను హతమార్చి సొమ్ము కాజేయాలని నిర్ణయించుకున్న రమాదేవి.. దర్శికి చెందిన స్నేహితురాలు ధర్మవరపు కుమారితో కలిసి పథకం రచించింది. ఈ క్రమంలో సిలిండర్లు తీసుకువెళ్లే నెపంతో రెండుసార్లు అర్ధరాత్రి వేళ సీతారావమ్మ ఇంటికి వెళ్లి తలుపులు తెరవాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో ముండ్లమూరు మండలం లక్ష్మీపురానికి చెందిన సుధాకరరెడ్డి కారును బాడుగకు తీసుకుని ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం సీతారావమ్మ ఇంటికి వెళ్లారు. కండువా, స్కార్ఫ్‌ను సీతారావమ్మ మెడకు బిగించి, కాళ్లూచేతులను చీరెతో కట్టేసి చంపారు. ఆమె శరీరంపై ఉన్న 31.82 గ్రాముల బంగారు గాజులు రెండు, 2.29 గ్రాముల చెవి కమ్మలు, 3.68 గ్రాముల చెవి మాటీలు, 14 గ్రాముల కాశీనాయన పూసల దండతోపాటు పోకో సీ3 మొబైల్, రూ.3 వేల నగదు తీసుకుని మృతురాలి ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
 
రెండు రోజుల తర్వాత వెలుగులోకి.. 
సీతారావమ్మ ఇంటికి తాళం వేసి ఉండడం, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా ఆమె శవమై పడి ఉంది. సీతారావమ్మ కుమార్తె అనూరాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఎటువంటి క్లూలు లభించలేదు. అయితే తన ఇంటికి రెండుసార్లు అర్ధరాత్రి పూట రమాదేవి వచ్చివెళ్లిన విషయాన్ని చుట్టుపక్కల వారితో సీతారావమ్మ చెప్పిన మాటలు నిందితుల గుర్తింపులో కీలకంగా మారాయి. రమాదేవిపై నిఘా ఉంచిన పోలీసులు 7వ తేదీన సీతారావమ్మ ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. దర్శి బస్టాండు వద్ద రమాదేవిని, మరో నిందితురాలు కుమారిని ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు.  

చదవండి: (ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!)

చోరీ సొత్తు మార్చి బ్యాంకులో తాకట్టు 
సీతారావమ్మ ఇంట్లో దోచుకున్న సొత్తును దర్శిలోని సాయిబాబా జ్యూవెలరీస్‌లో ఇచ్చి కొత్త నగలు తీసుకున్నారు. ఆ నగలను రమాదేవి తన తండ్రితో బ్యాంకులో తాకట్టుపెట్టించి బాకీ తీర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో షాపు యజమాని నుంచి సీతారావమ్మకు చెందిన నగలను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.2.23 లక్షలుగా అంచనా వేశారు.

మరిన్ని వార్తలు