వామన్‌రావు దంపతుల హత్య కేసు: చార్జిషీట్‌లో ఏముంది?

20 May, 2021 04:38 IST|Sakshi

 వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆన్‌లైన్‌లో చార్జిషీట్‌!

నేడు మంథని కోర్టులో ప్రతులు అందజేసే అవకాశం 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/మంథని: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో చార్జిషీట్‌ను పోలీ సులు బుధవారం ఆన్‌లైన్‌లో కోర్టుకు పంపినట్లు తెలిసింది. 90 రోజుల్లోగా చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉండగా.. బుధవారంతో గడువు ముగియడంతో ఆన్‌లైన్‌ ద్వారా సాఫ్ట్‌కాపీలను అప్‌లోడ్‌ చేశారు. చార్జిషీట్‌ కాగితపు ప్రతులను గురువారం మంథని కోర్టులో అందజేసే అవకాశం ఉంది. చార్జిషీటులో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపారనేది తెలియాల్సి ఉంది.

కేసు నేపథ్యం: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిలను ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో ప్రధాన రహదారిపైనే కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. తమపై దాడి చేసింది కుంట శ్రీను అని తీవ్రంగా గాయపడ్డ వామన్‌రావు చెప్పిన వీడియా టేప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితులైన కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌లను 19న మంథని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను కస్డడీలో విచారించగా పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి వచ్చింది. తమకు కత్తులు, కారు ఇచ్చి హత్యకు సహకరించింది బిట్టు శ్రీను అని వెల్లడించారు. దీంతో బిట్టు శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దర్యాప్తును కూడా స్వయంగా పర్యవేక్షిస్తోంది. 

తెరపైకి జడ్పీ చైర్మన్‌
హత్యలపై మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు దంపతులను విచారించాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్‌ ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. తనను అరెస్టు చేస్తారనే అనుమానంతో పుట్ట మధు కొద్ది రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారం తర్వాత పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

మూడు రోజులపాటు విచారించి వదిలి పెట్టడంతో మధు పాత్రపై పోలీసులు ఏం తేల్చారనే విషయం తెలియాల్సి ఉంది. మధు దంపతులతోపాటు కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణ, మరికొందరు అనుమానితులను సైతం పోలీసులు విచారించారు. దీంతో చార్జిషీట్‌లో ఏయే విషయాలు పొందుపరిచారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. 


   

మరిన్ని వార్తలు