భారీగా డబ్బుల కట్టలు స్వాధీనం.. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ బుకీ అరెస్ట్‌

30 Nov, 2021 00:48 IST|Sakshi

చదివింది నాలుగు.. బెట్టింగ్‌లో కోట్లు

మోసం చేశారని ఫిర్యాదు రావడంతో హన్మకొండ జిల్లా వాసితోపాటు మరొకరి అరెస్ట్‌

రూ.2 కోట్లకు పైగా నగదు, 43 పాస్‌బుక్‌లు స్వాధీనం 

వరంగల్‌ క్రైం: అతను చదివింది నాలుగో తరగతి. ఆన్‌లైన్‌లో అందెవేసిన చేయి. ముంబై బుకీతోపాటు స్నేహితులతో కలసి ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్, మూడు ముక్కలాట నిర్వహణతో రూ.కోట్లు గడించాడు. వీరి చేతిలో మోసపోయిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా గుట్టు రట్టయ్యింది. ముంబై కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు, 7 సెల్‌ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించిన 43 పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి సోమవారం మీడియా సమావేశంలో ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. హనుమకొండ జిల్లా విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్‌ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లి రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారం ప్రారంభించాడు. కానీ వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కొద్ది మంది స్నేహితులతో కలసి 2016లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ దందా ప్రారంభించాడు.

దీని ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడంతోపాటు 2018లో స్నేహితులతో కలసి ఆన్‌లైన్‌లో మూడు ముక్కలాటను ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రసాద్‌కు ముంబై కేంద్రంగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే అభయ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రసాద్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకీగా మారాడు. భారీగా డబ్బులు సంపాదించాడు. ఈ క్రమంలో అటు బెట్టింగ్, ఇటు మూడు ముక్కలాటలో పలువురు వ్యక్తులు ఈ ముఠా చేతిలో మోసపోయారు.  

చదవండి: Swiggy Delivery Boys: స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ హెచ్చరిక.. వారంలో డిమాండ్లు పరిష్కరించాలి, లేదంటే..

లాభాల పంపకంలో ఉండగా..  
2019లో బెట్టింగ్‌ నేరంపై సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రామచంద్రాపురం పోలీసులు ప్రసాద్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. బయటికి వచ్చాక హైదరాబాద్‌లో తిరిగి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తే పోలీసులు సులభంగా గుర్తిస్తారని, మళ్లీ హనుమకొండకు మకాం మార్చాడు. అప్పటి నుంచి యథేచ్ఛగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్, మూడుముక్కలాట నిర్వహణతో భారీగా డబ్బులు సంపాదించి బినామీ పేర్లతో బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బు జమచేశాడు.

చదవండి: Mariamma Lockup Death Case: మరియమ్మ లాకప్‌ డెత్‌పై తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు

ఆ డబ్బుతో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేశాడు. కాగా, ఇటీవల బెట్టింగ్‌లో మోసపోయిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులతో ఈ ముఠాపై కేయూ పోలీస్‌స్టేషన్‌లో రెండు, హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదు అయింది. దీంతో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్పారెడ్డి, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడైన ముంబై బుకీ అభయ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకునేందుకు ప్రసాద్‌ ఇంటికి రాగా, కేయూ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.  

చదవండి: Ameerpet: ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్‌ చేసి ఆడియోలో అసభ్యకరంగా..

మరిన్ని వార్తలు