సోఫా కొంటాను రూపాయి పంపమన్నాడు, నిండా ముంచేశాడు

20 Apr, 2021 12:05 IST|Sakshi

సాక్షి, చందానగర్‌: ఓఎల్‌ఎక్స్‌లో సోఫా అమ్మకం కోసం పెట్టిన వ్యక్తిని మోసగించి రూ.25 వేలు కాజేసిన ఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ అహ్మద్‌ పాషా కథనం ప్రకారం.. చందానగర్‌ అపర్ణ లేక్‌ బ్రిజ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే జోసెఫ్‌ అంగర్‌ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. అతను ఓఎల్‌ఎక్స్‌లో తన సోఫా విక్రయానికి పెట్టగా, ఫోన్‌ నం. 9090045860 నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. రూ. 15 వేలకు సోఫా కొనుగోలు చేస్తానని, తనకు ఒక రూపాయి క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పంపించాలని ఓ గుర్తు తెలియని వ్యక్తి కోరారు. జోసెఫ్‌కు క్యూ ఆర్‌ కోడ్‌ పంపించాడు. ఆ క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన జోసెఫ్‌ ఒక రూపాయి పంపగా, తిరిగి రూ. 2 వచ్చాయి. అలా ఒకటి, రెండు, ఐదు, పది రూపాయల వరకు పంపగా అవి రెట్టింపు అయ్యి జోసెఫ్‌కు వచ్చాయి.

ఇది నిజమని నమ్మిన జోసెఫ్‌ పేటీఎం అకౌంట్‌ నుంచి రూ.5 వేలు గుర్తు తెలియని వ్యక్తికి పంపగా, సాంకేతిక కారణాలు చెప్పి జోసెఫ్‌ నుంచి ఆ కేటుగాడు దఫా దఫాలుగా మొత్తం రూ. 25 వేలు రాబట్టాడు. తనకు డబ్బులు తిరిగి రాకపోగా గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చందానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కేవైసీ అప్‌డేట్‌ పేరిట టోకరా
చందానగర్‌: కేవైసీ అప్‌డేట్‌ పేరుతో రూ.39,999 కాజేసిన ఘటన చందానగర్‌ ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ అహ్మద్‌ పాషా తెలిపిన ప్రకారం.. డోయన్స్‌ టౌన్‌షిప్‌ కాలనీలో  నివాసముండే చల్లా శ్రీనివాస్‌రెడ్డి ఎల్‌ఐసీ ఏజెంట్‌.  కస్టమర్‌ కేర్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నానని ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడికి కాల్‌ చేశాడు. మీరు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని చెప్పి లింక్‌ పంపించాడు. ఆ లింక్‌ను ఓపెన్‌ చేయగా క్లిక్‌ సపోర్ట్‌ అనే యాప్‌ డౌన్‌లోడ్‌ అయ్యింది. మరో లింక్‌ పంపుతానని గూగుల్‌ క్రోమ్‌ ద్వారా దానిని ఓపెన్‌ చేసి, రీచార్జ్‌ కోసం ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేయాలని చెప్పాడు.

అతడు చెప్పిన విధంగా  శ్రీనివాస్‌రెడ్డి చేయగా, అందులో టాప్‌ హెడ్‌లైన్‌ ద్వారా రీఛార్జ్‌ రూ.32 చేయాలని ఉంది.  ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేసిన మరుక్షణమే శ్రీనివాస్‌రెడ్డి అకౌంట్‌లో ఉన్న మొత్తం రూ.39,999లు డెబిట్‌ అయినట్లు మెసెజ్‌ వచ్చింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబర్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: మేమేం పాపం చేశాం.. మాకెందుకీ కడుపుకోత

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు