ఆన్‌లైన్‌ మోసగాడి అరెస్ట్

22 Nov, 2020 04:53 IST|Sakshi
మీడియా ఎదుట నిందితుడ్ని హాజరుపర్చిన పోలీసులు

సీఎం సహాయనిధి నుంచి నగదు సాయం ఇప్పిస్తానంటూ మోసం

నెల్లూరు (వీఆర్సీ సెంటర్‌): సీఎం సహాయనిధి నుంచి నగదు సాయం ఇప్పిస్తానంటూ ఆపదలో ఉన్న వారి నుంచి నగదు వసూలు చేస్తున్న ఆన్‌లైన్‌ మోసగాడిని సీఎంవో అధికారుల ఫిర్యాదుతో నెల్లూరు నవాబుపేట పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నెల్లూరు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి వివరాలు వెల్లడించారు. నెల్లూరులోని జాకీర్‌హుస్సేన్‌ నగర్‌కు చెందిన ఎస్‌కే సైలాఫ్‌ 17 ఏళ్ల కుమారుడు గౌస్‌ మొహిద్దీన్‌ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం రూ.4 లక్షలు అప్పు చేశాడు. వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నట్టు సైలాఫ్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు.

ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పెద్దసముద్రం మండలం దువ్వూరు నారాయణపల్లికి చెందిన సందీప్‌రెడ్డి ఫేస్‌బుక్‌లో పరిచయమై బాధితుడికి ఫోన్‌ చేశాడు. రూ.10 వేలు ఇస్తే సీఎం సహాయనిధి నుంచి రూ.1.50 లక్షలు ఇప్పిస్తానని నమ్మించడంతో సైలాఫ్‌ ఆన్‌లైన్‌ ద్వారా రూ.3,600, మరోసారి రూ.1,500 పంపించాడు. కాగా సీఎం కార్యాలయ అధికారులు సైలాఫ్‌కు ఫోన్‌ చేసి అతడి కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో తాను సందీప్‌రెడ్డికి నగదు ఇచ్చినట్లు చెప్పడంతో అధికారులు, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వేమారెడ్డి, ఎస్సైలు రమేష్‌బాబు, శివప్రకాష్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సందీప్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు