డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. చాటింగ్‌లో మునిగితేలారు.. చివరకు

20 Oct, 2021 07:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి(కర్ణాటక): సిలికాన్‌ సిటీలో ఆన్‌లైన్‌ బందిపోట్లు దోచేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో యువతీ యువకులను బురిడీకొట్టించి లక్షలాది రూపాయలు వంచనకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరు నగరంలో ఇద్దరు మహిళలు లక్షలాది రూపాయల వంచనకు గురయ్యారు. ఆన్‌లైన్‌లో ఉద్యోగమని మహిళను నమ్మించి రూ.19.67 లక్షలను స్వాహా చేశారు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగం సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మడివాళ మారుతీనగరకు చెందిన 33 ఏళ్ల మహిళ బాధితురాలు.

గృహిణి అయిన ఆమె ఇంటి వద్ద నుంచి పార్ట్‌టైం జాబ్‌ చేసి డబ్బు సంపాదించవచ్చని ఇంటర్నెట్లో పలు ప్రకటనలను చూసింది. ఓ వెబ్‌సైట్‌లో శోధించగా, వంచకులు పరిచయమయ్యారు. వస్తువుల విక్రయం ద్వారా దండిగా కమీషన్‌ పొందవచ్చునని ఆశచూపారు. దరఖాస్తు భర్తీ చేయాలని ఆమె వాట్సప్‌కి ఒక లింక్‌ను పంపించగా క్లిక్‌చేసి భర్తీ చేసింది. ఇక రిజిస్ట్రేషన్‌ తదితర ఫీజులను చెల్లించాలని ఆమె నుంచి విడతలవారీగా రూ.19.67 లక్షలను రాబట్టారు. చివరకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోగా, ఫోన్లు కూడా స్విచాఫ్‌ చేసుకున్నారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఆగ్నేయ విభాగ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి కేటుగాళ్ల కోసం గాలిస్తున్నారు.  

ముంచేసిన డేటింగ్‌ పరిచయం  
మొబైల్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన మోసగాని వల్ల బెంగళూరు మహిళ రూ.18.29 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటనపై కేంద్ర విభాగ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆస్టిన్‌టౌన్‌ నివాసి అయిన 37 ఏళ్ల మహిళ డేటింగ్‌ యాప్‌లో ఖాతా తెరిచింది. ఆ యాప్‌లో ఆమెకు ఓ వ్యక్తితో పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఫోన్‌లో మాట్లాడుకోవడం, చాటింగ్‌లో మునిగితేలారు. ఇద్దరూ ఫోటోలు వినిమయం చేసుకున్నారు. విదేశాల్లో స్థిరపడినట్లు చెప్పుకున్న వంచకుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా అంగీకరించింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని నమ్మించి ఆమె నుంచి పలు దఫాలుగా రూ.18.29 లక్షలు జమ చేయించుకున్నాడు. ఓ రోజు వంచకుడు డేటింగ్‌ యాప్‌ నుంచి అకౌంట్‌ను తొలగించి ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు