క్రైమ్ సెల్‌ఫోన్‌లో బుకింగ్: విటుల వద్దకే అమ్మాయిల డోర్‌ డెలివరీ!

8 Dec, 2022 12:26 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: ఇద్దరు బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఒకటి పట్టుబడటం యాదగిరిగుట్టలో మరోసారి సంచలనం సృష్టించింది. బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపి వారిని పలు విధాలుగా హింసించిన ఘటన 2018 జూలైలో బయటపడింది. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గుట్టలో మళ్లీ వ్యభిచారం జరుగుతోందనే అనుమానం కొంతకాలంగా ఉంది. ఆ అనుమానాలు నిజం చేస్తూ ముఠా పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఈ ముఠాకు చెందిన మరి కొంతమంది బాలికలు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉన్నారని అనుమానిస్తున్నారు. వ్యభిచార నిర్వాహకులు సాంకేతికతను ఉపయోగించుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా విటుల వద్దకే అమ్మాయిలను పంపిస్తున్న వైనం వెలుగుచూసింది. ఈ కారణంగానే అనుమానితుల ఇళ్లలో పోలీసులు దాడులు చేసినా ఎలాంటి ఆ«ధారాలూ లభించడం లేదు. సెల్‌ఫోన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపించగానే అమ్మాయిలను పంపిస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఇలా ఈ నెల 2వ తేదీన విటుని వద్దకు పంపించే క్రమంలోనే ఒక బాలిక యాదగిరిపల్లి నుంచి తప్పించుకుంది. 

సిరిసిల్ల వెళ్లేందుకు ప్రయత్నించి..
విటుని వద్దకు వెళ్లాల్సిన బాలిక.. అనసూయ తనను తరచు కొడుతూ హింసిస్తుండటంతో, తనను బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో సిరిసిల్లలో ఉండే వ్యభిచార నిర్వాహకుడు కంసాని శ్రీనివాస్‌ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. యాదగిరిపల్లి పక్క గ్రామమైన వంగపల్లికి కాలిబాటన చేరుకున్న బాలిక అక్కడ రూ.20 అడుక్కుని జనగామ బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడినుంచి సిరిసిల్ల వెళ్లేందుకు విద్యార్థులను డబ్బులు అడుగుతుండగా విద్యార్థులు 100 నంబర్‌కు ఫోన్‌ చేశారు. పోలీసులు వచ్చి వివరాలు అడగడంతో ఆ బాలిక కంసాని అనసూయ పేరు చెప్పింది. దీంతో యాదగిరిగుట్టలో మూడేళ్లుగా సాగుతున్న వ్యభిచారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 

కలెక్టర్‌ సమాచారంతో సీపీ అలర్ట్‌
మైనర్‌ బాలిక వ్యభిచార కూపంలో చిక్కుకున్న విషయం పోలీసులు మీడియాకు వెల్లడించకముందు (ఈ నెల 3న) కలెక్టర్‌ పమేలా సత్పతి రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ దృష్టికి తీసుకుపోయారు. ఆయన వెంటనే వ్యభిచార కూపంలో ఉన్న బాలికలను రక్షించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో షీ టీం, ఎస్‌ఓటీ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నాలుగు చోట్లకు వెళ్లారు. హుస్నాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్లలో ఏకకాలంలో అనుమానితుల ఇళ్లపై మెరుపు దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే మరో మైనర్‌ బాలిక దొరికింది. ఇద్దరు బాలికలను ప్రస్తుతం అధికారులు సఖి కేంద్రంలో ఉంచారు. 

చిత్రహింసలతోనే వెలుగులోకి..
యాదగిరిపల్లిలో ఉంటున్న కంసాని అనసూయ వ్యభిచారం చేయిసూ్తనే తిండి పెట్టకుండా, కొట్టడం, తిట్టడం చేస్తుండడంతో అది భరించలేని బాలిక తప్పించుకుంది. ఈ బాలికతో పాటు మరో బాలికను కూడా చిన్నతనంలోనే అనసూయ ఎక్కడినుంచో తెచ్చుకుని తన చెల్లెలు కూతుళ్లని చెప్పి పెంచింది. వారికి కొంత వయసు రాగానే వ్యభిచార కూపంలోకి దించింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఉంటున్న కంసాని శ్రీనివాస్‌కు వద్దకు కూడా పంపిస్తూ మూడేళ్లుగా వ్యభిచారం చేయిస్తోంది. వ్యభిచార నిర్వాహకులు ఎక్కడినుంచో చిన్నారి బాలికలను తెచ్చి తమ బ«ంధువుల పిల్లలుగా పెంచడం, తర్వాత వ్యభిచార కూపంలోకి దించడం యాదగిరిగుట్టలో ఎప్పటినుంచో జరుగుతోంది. 2018 జూలై 30న ఐదేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెడుతుంటేనే వ్యభిచార ముఠాగుట్టు రట్టుఅయ్యింది. అప్పట్లో ఏకంగా 34 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. తాజాగా వ్యభిచార కూపం నుంచి బయటపడిన ఓ బాలిక తనకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పింది. నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టేవాడని, తనను చిన్నతనంలోనే అమ్మేశారని తెలిపింది. మరో బాలిక తన వివరాలను వెల్లడించలేదు.  

మరిన్ని వార్తలు