కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లినందుకు...

20 Nov, 2020 15:53 IST|Sakshi

అందుకే ఈ దారుణానికి పాల్పడింది: న్యాయవాదులు

ఆమె ఉరిశిక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

60 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో ‘ఆమె’కు ఉరి శిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండియానా రాష్ట్రంలోని టెర్రెహాటెలో డిసెంబర్‌ 8వ తేదీన తెల్లవారు జామున ఆమెను ఉరితీయాలని అమెరికా కోర్టు మూహూర్తం కూడా ఖరారు చేసింది. ఆమెను ఉరితీసినట్లయితే అమెరికా గత 60 ఏళ్ల చరిత్రలో ఓ మహిళకు మరణ శిక్ష విధించడం ఇదే మొదటి సారి అవుతుందని అమెరికా పత్రికలు వెయ్యి నోళ్లతో కీర్తించాయి. అమెరికాలో అత్యంత కిరాతకమైన నేరాల్లో తప్పించి సాధారణంగా ఎవరికి ఉరి శిక్ష విధించరు. మరి ఆమె పేరిమిటో, ఆమె చేసిన కిరాతకమైన నేరం ఏమిటో తెలుసుకుంటే తప్పించి ఎందుకు మరణ శిక్ష విధించారో అర్థం కాదు. 

ఆమె పేరు లీసా మాంట్‌గోమరి. ప్రస్తుతం టెక్సాస్‌ జైల్లో ఉన్నారు. ఆమె 2004, డిసెంబర్‌లో మిస్సోరిలోని స్కిడ్‌మోర్‌లో నిండు గర్భవతి అయిన 23 ఏళ్ల బొబ్బీ జో స్టిన్నెట్‌ను కిరాతకంగా చంపారు. ఎనిమిది నెలల కడపుతో ఉన్న బొబ్బీని కడుపు పైన, దిగువన తాళ్లతో బిగించి, వంటింటి చాకుతో ఆమె గర్భాన్ని కోసి, అందులోని పాపను లీసా ఎత్తుకొని పోయింది. ఈలోగా రక్తస్రావంతో బొబ్బీ చనిపోగా, ఆమె కడుపు నుంచి తీసిన పాపను తన పాపగా చెప్పుకునేందుకు లీసా ప్రయత్నించి విఫలమైంది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. 

లీసా తరఫున క్షమాభిక్ష పిటిషన్‌ వేయించేందుకు ఇటీవల టెక్సాస్‌ జైలుకెళ్లి ఆమెను కలసుకున్న న్యాయవాదులు కెల్లరీ హెన్రీ, అమీ హార్వెల్‌లకు కరోనా సోకింది. దాంతో వారు తమకు కరోనా సోకినందున, పిటిషన్‌పై సంతకం చేసే మానసిక పరిస్థితి లీజాకు లేనందున ఆమె ఉరిశిక్షను వాయిదా వేయాలని వారు జిల్లా జడ్జీ రాండల్ఫ్‌ మోజ్‌ను కోరారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న జడ్జీ, లీసా ఉరిశిక్షను తదుపరి ఉత్తర్వుల వరకు వాయిదా వేయాల్సిందిగా జైళ్ల బ్యూరోను ఆదేశించారు. డిసెంబర్‌ 24వ తేదీలోగా క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా న్యాయవాదులను కోరారు. అప్పటిలోగా వారు కరోనా నుంచి కోలుకోక పోయినట్లయితే ఇతర న్యాయవాదుల సహాయం తీసుకోవాల్సిందిగా జడ్జీ సూచించారు. (చదవండి: వీడని నర్సు మృతి మిస్టరీ.. 5 లక్షల డాలర్ల రివార్డు!)

బాల్యంలోనే అపహరణకు గురై లైంగిక వేధింపులకు గురికావడమే కాకుండా, యుక్త వయస్సులో గ్యాంగ్‌ రేప్‌నకు గురైనందున లీసా మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, తనకూ ఓ బిడ్డ కావాలంటూ తపన పడేదని, కుక్క పిల్లలను బిడ్డలాగానే చూసుకునేదని, బిడ్డ కావాలనే తపన మితిమీరి పోవడంతో ఈ దారుణానికి పాల్పడిందని ఆమె తరఫు న్యాయవాదులు మొదటి నుంచి కేసులో వాదిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆమె చేసినది అరుదైన, కిరాతకమైన నేరం అవడం వల్ల కోర్టు లీసాకు మరణ శిక్ష విధించింది. 

ఇక క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయడానికి అవసరమైతే ఇతర న్యాయవాదుల సహాయం తీసుకోమని కోర్టు సూచించిందిగానీ, మానసిక పరిస్థితి సవ్యంగాలేని లీసా తమ మాటలను తప్పించి ఇతరుల మాటను వినే పరిస్థితుల్లో లేదని, 15 ఏళ్లుగా తామే కేసు వాదిస్తున్నందున తమను మాత్రమే ఆమె నమ్మే అవకాశం ఉందని లీసా న్యాయవాదులు తెలిపారు. అమెరికా కోర్టులకు మరణ శిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే హక్కులు లేవు. క్షమాభిక్ష పిటిషన్లను విచారించి వాటిని దేశాధ్యక్షుడికి పంపిస్తుంది. వాటిని పరిశీలించే దేశాధ్యక్షుడు మరణ శిక్షలను యావజ్జీవ కారాగార శిక్షలుగా మార్చవచ్చు. చాలా కేసుల్లో అదే జరుగుతుంది. 

మరిన్ని వార్తలు