ట్విస్టులే ట్విస్టులు.. కిడ్నాపర్‌ను పట్టించిన స్టిక్కర్‌.. ఆపరేషన్‌ ‘నిమ్రా’ సక్సెస్‌

17 Aug, 2022 19:53 IST|Sakshi
నిందితుడు సంతోశ్‌ (వృత్తంలో ఉన్న వ్యక్తి)ను ప్రశ్నిస్తున్న స్థానికులు, పాపను ఎత్తుకెళ్లిన ఆటో వెనక ఉన్న స్టిక్కర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ కరీంనగర్‌క్రైం: నగరంలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. నాలుగు గంటల్లోనే కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు బాలికను తల్లిఒడికి చేర్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ కుత్బుద్దీన్‌ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కూతురు నిమ్రా ఉంది.
చదవండి: పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు

సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైంది. స్థానికం గా గాలించినా ఆచూకీ తెలియలేదు. పాప ఆటోలో వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుత్బుద్దీన్‌ రాత్రి 9.30 గంటలకు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రంయించాడు. ఏసీపీ తుల శ్రీనివాస్‌ నేతృత్వంలో ఐదు సివిల్, ఒక టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ, స్థానికుల సమాచారంతో గంట వ్యవధిలోనే పాపను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్‌ సంతోశ్‌ ఇంటిని గుర్తించారు.

అతని ద్వారా నిమ్రా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమద్ది రాములు ఇంట్లో ఉంచాడని తెలుసుకున్నారు. అతని ఇంటికి వెళ్లి పాపను అర్ధరాత్రి దాదాపు 12.45 గంటలకు సురక్షితంగా కాపాడారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు నటేశ్, దామోదర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, రహీంపాషా, టీ.మహేశ్, హెడ్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాస్,లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, దేవేందర్, కానిస్టేబుళ్లు బషీర్‌ అహ్మద్‌ ఖాన్, రవీందర్, మల్లయ్య, రాజ్‌కిరణ్,  బద్రుద్దీన్, మనోహర్‌లను సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. 


నిమ్రాను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు 

మేనమామ అనుకుని ఎక్కిన నిమ్రా 
సోమవారం రాత్రి 7 గంటలకు అశోక్‌నగర్‌ ఉండే ఆటోడ్రైవర్‌ సంతోశ్‌ వద్దకు ఇద్దరుమహిళలు వచ్చి బీబీఆర్‌ ఆసుపత్రి వెళ్లేందుకు కిరాయి మాట్లాడుకున్నారు. వారిది చిన్నగల్లీ కావడంతో ఆటో వెళ్లలేదు. రాత్రి 7.25కి ఆటో(టీఎస్‌ 02యూసీ 3079)ను కుత్బుద్దీన్‌ ఇంటి ఎదుట నిలిపాడు. బయట ఆడుకుంటున్న నిమ్రా తన మేనమామ  ఆటో అనుకుని ఎక్కింది. సంతోశ్‌ పక్కనే కూర్చుంది. మద్యంమత్తు లో ఉన్న అతనూ చిన్నారి నిమ్రాను వారించలేదు. ఈలోపు మహిళలురాగానే వారిని బీబీఆర్‌ ఆసుపత్రి వద్ద దించాడు. తరువాత అతనిలో పాపను అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది.

కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమ ద్ది రాములుకు పాపను అప్పగించాడు. తెల్లవారి పాపను ఎంతోకొంతకు విక్రయించాలని ఇద్దరూ కలిసి అనుకున్నారుు. ఏమీ తెలియనట్లుగా రాత్రి 11.30 గంటలకు సంతోశ్‌ తిరిగి ఇల్లు చేరాడు. అప్పటికే కాపుకాసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మొత్తం విషయం కక్కేశాడు. వన్‌టౌన్‌ పోలీసులు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేరాత్రి ఖాజీపూర్‌లోని రాములు ఇంటిని చుట్టుముట్టారు. రాత్రి 12.45 గంటలకు ఏసీపీ తుల శ్రీనివాస్, సీఐ నటేశ్, ఎస్సై శ్రీనివాస్‌లు  పాపను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. 

స్టిక్కర్‌ పీకేసిన సంతోశ్‌ 
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నగరంలో ఆటోలపై స్టిక్కర్లు వేశారు. బీబీఆర్‌ ఆస్పత్రి వద్ద మహిళలను దించిన సమయంలోనూ సంతోశ్‌ ఆటోపై స్టిక్కర్‌ ఉంది. పాపను రాములుకు అప్పగించిన తరువాత స్టిక్కర్‌ను తొలగించాడు. ఆటో నంబరు సరిపోలినా.. వెనక స్టిక్కర్‌ లేదు. కానీ, స్టిక్కర్‌ తీసేసిన ప్రాంతం జిగటగా ఉండటంతో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదే ఆటో అని నిర్ధారించుకుని సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిమ్రా అదృశ్యమవగానే.. పాప చిత్రం, వివరాలతో పలు మెసేజ్‌లు నగరంలోని పలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరలయ్యాయి. దీంతో పలువురు యువకులు స్వచ్ఛందంగా గాలించారు. పాప ఆచూకీ చిక్కిన సమయంలోనూ వీరంతా పోలీసుల వెంటే ఉండటం గమనార్హం 

మరిన్ని వార్తలు