రెండు క్రేన్ల ఢీ: ఆపరేటర్‌ మృతి 

2 Mar, 2021 09:40 IST|Sakshi
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ సురేష్‌ 

సాక్షి, గచ్చిబౌలి: రోడ్డుపై రెండు క్రేన్లు వేగంగా వెళ్తున్నాయి.. ఒక క్రేన్‌ అదుపుతప్పి ముందు వెళుతున్న క్రేన్‌ను ఢీకొట్టింది. తర్వాత ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో క్రేన్‌ ఆపరేటర్‌ మృతి చెందాడు.  గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ గోనె సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్‌ అలియాస్‌ అనిల్‌ యాదవ్‌(26) బాలానగర్‌ ఫిరోజ్‌గూడలో ఉంటూ క్రేన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.

ఆదివారం రాత్రి 12 గంటలకు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అమెజాన్‌లో మెటీరియల్‌ ఎత్తేందుకు రెండు క్రేన్లు వెళ్లాయి. రాత్రి ఒంటి గంట సమయంలో విప్రో జంక్షన్‌ సమీపంలో వెనుక వస్తున్న క్రేన్‌ న్యూట్రల్‌ కావడం, జంక్షన్‌లో రోడ్డు డౌన్‌గా ఉండటంతో వేగంగా దూసుకెళ్లి ముందు వెళ్తున్న క్రేన్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌ను తాకి బోల్తా కొట్టింది. ఆపరేటర్‌ అనిల్‌ యాదవ్‌ క్రేన్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు.

కాగా, ముందు వెళుతున్న క్రేన్‌ అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టడంతో ముందు చక్రాలు ఊడిపడ్డాయి. ఆ క్రేన్‌పై ఉన్న ఆపరేటర్‌ షఫీకి అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు. ఫుట్‌పాత్‌ వెంట టీఎస్‌ఐఐసీ అధికారులు ఏర్పాటు చేసిన గ్రిల్స్, ఇనుప స్తంభాలు నేలమట్టమయ్యాయి. సోమవారం ఉదయం మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్, గచ్చిబౌలి సీఐ సురేష్‌ , ట్రాఫిక్‌ సీఐ నర్సింహారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు