‘ధూం సినిమా చూడండి.. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి’ .. చివరికి..

9 Jul, 2022 08:33 IST|Sakshi

కొరాపుట్‌: ‘ధూం సినిమా చూడండి.. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్‌ విసిరిన దొంగలు దొరికిపోయారు. నవరంగ్‌పూర్‌ జిల్లా ఎస్పీ ఎస్‌.సుశ్రీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలోని ఖాతీగుడ సమితి ఇంద్రావతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 3న చోరీ జరిగింది. పాఠశాలలోని కంప్యూటర్లు, ఇతర సమాగ్రి ఎత్తుకుపోయిన దుండగులు.. అక్కడితో ఆగకుండా మితిమీరిన ఆగడాలకు పాల్పడ్డారు. ఇదే వారిని పట్టించేలా చేసింది. తమది ధూం 4 స్టైల్‌ అని, ఇదే తరహాలో మరో దొంగతనం కూడా చేస్తామని వీలైతే అడ్డుకోవాలని సూచించారు.

పాఠశాల బోర్డుపై ఫోన్‌నంబర్లు రాసి, దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవా ల్‌ విసిరారు. తమను సంప్రదించి, డబ్బులు పట్ట కొని వస్తే దొంగిలించిన వస్తువులు తిరిగి ఇస్తామని ప్రకటించారు. దీంతో పోలీసులు ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేశారు. దొంగలు రాసిన నాలుగు ఫోన్‌ నంబర్లపై నిఘా పెట్టారు. అయితే అత్యుత్సాహంతో 2 రోజుల క్రితం ఇందులోని ఒక నంబర్‌కి ఫోన్‌ చేసి, ఎవరైనా ఈ కేసుపై ఫోన్‌ చేశారా అని ఆరా తీశారు.

వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఆ నంబర్‌ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వీరు ఇంద్రావతికి చెందిన ఆదిత్యకుమార్‌ దాస్, ఆనందకుమార్‌ దాస్‌గా గుర్తించారు. వారి ఇళ్లల్లో సోదాలు చేయగా దొంగిలించబడిన వస్తువులు పట్టుబడ్డాయి. వారి రాతలను పరిశీలించగా, పాఠశాల బోర్డులపై రాసిన రాతలు నిందితులవిగానే తేటతెల్లమైంది. నిందితులు ఇద్దరూ అన్నదమ్ములని, వారు ఇదే బడిలో పూర్వ విద్యార్థులని ఎస్పీ ప్రకటించారు.

చదవండి : హైటెక్‌ దొంగతనం.. తెలివి మామూలుగా లేదుగా!

మరిన్ని వార్తలు