అంగన్‌వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా?

15 Sep, 2021 20:50 IST|Sakshi

భువనేశ్వర్‌: అంగన్వాడీ కార్యకర్త అక్రమాస్తుల సంపాదన వ్యవహారాన్ని విజిలెన్స్‌ సిబ్బంది మంగళవారం బట్టబయలు చేశారు. పలుచోట్ల ఒకేసారి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఈ విషయం తేటతెల్లమైంది. వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని కొరొడొకొంటా అంగన్వాడీ కేంద్రం కార్యకర్త కబితా మఠాన్‌ రూ.4 కోట్లు పైబడి విలువైన ఆస్తులను ఆర్జించినట్లు విజిలెన్స్‌ అధికారులు లెక్క తేల్చారు.

ఖుర్దా, కేంద్రాపడా, జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లాల్లో ఒకేసారి ఉదయం సోదాలు చేపట్టిన అధికారులు అక్రమాస్తుల చిట్టాని వెలుగులోకి తీసుకువచ్చారు. సదరు అంగన్వాడీ కార్యకర్త ఆస్తుల గుట్టు రట్టు చేయడంలో 6 బృందాలు పాల్గొనగా, వీరిలో 10 మంది డీఎస్పీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. 4 భవనాలు, 10 ఇళ్ల స్థలాలు, విలాసవంతమైన కారు, విలువైన బంగారు ఆభరణాలను కబితా మఠాన్‌ ఆర్జించినట్లు అధికారులు గుర్తించారు. భవనాల్లో భువనేశ్వర్‌లో 4 అంతస్తుల భవనం ఒకటి, 3 అంతస్తుల భవనం మరొకటి, 2 రెండంతస్తుల భవనాలు ఉన్నాయి.

అలాగే జగత్‌సింఘ్‌పూర్‌ జిల్లాలోని తొలొకుసుమ ప్రాంతంలో 3 ఇళ్ల స్థలాలు, ఖుర్దా జిల్లాలోని బలియంత ప్రాంతంలో ఒక ఇంటి స్థలం, ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు ఉండగా, రూ.2.20 లక్షల విలువైన బీమా పొదుపు ఖాతాలు, రూ.6.36 లక్షలు విలువ చేసే 212 గ్రాముల బంగారం ఆభరణాలు, పలు స్థిర చరాస్తులు ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారుల దాడిలో గుర్తించారు. వీటి సమగ్ర విలువ రూ.4 కోట్లు పైబడి ఉంటుందని అధికార వర్గాల సమాచారం. 

చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే..

మరిన్ని వార్తలు