సినిమాకు డబ్బు ఇవ్వలేదని ఆదరించిన వాడినే అంతమొందించాడు.. 

11 Aug, 2021 08:23 IST|Sakshi
విలేకర్లతో మాట్లాడుతున్న డీఎస్పీ శివ భాస్కర్‌రెడ్డి

హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

ఒంటిమిట్ట: తనకు ఎవరూ లేరు.. అనాథ అని వచ్చిన ఓ యువకుడు ఆదరించిన వ్యక్తినే అంతమొందించి పరారయ్యాడు. దాదాపు 18 నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులు ఆ నిందితుడిని పట్టుకున్నారు.  ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కల్యాణ వేదికకు సమీపంలో  శ్రీ సాయిరాం సిమెంట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీలో గత ఏడాది ఫిబ్రవరి 29న హత్యకు గురైన వాచ్‌ మెన్‌  కత్తి వెంకట రమణ (50) కేసును ఎట్టకేలకు ఒంటిమిట్ట పోలీసులు ఛేదించారు. మంగళవారం ఒంటిమిట్టలో డీఎస్పీ శివభాస్కర్‌ రెడ్డి విలేకరుల ఎదుట నిందితుడిని హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.    

శ్రీ సాయిరాం సిమెంట్‌ బ్రిక్స్‌ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా  కత్తి వెంకట రమణ ఉండేవాడు. ఇతనికి రెండు ఆటోలు ఉండేవి. ఒక ఆటోను వెంకట రమణ కుమారుడు భరత్‌ నడుపుతుండగా.. మరో ఆటోను షబ్బీరుల్లా అనే వ్యక్తి నడిపేవాడు. ఈ క్రమంలో నిందితుడు 20 ఏళ్ల వయసు కలిగిన ధనుష్‌ (అఖిల్‌).. షబ్బీరుల్లా వద్దకు వచ్చాడు. తనకు ఎవరూ లేరని.. ఏదైనా పని ఇప్పించాలని కోరాడు. షబ్బీరుల్లా ఆటో తనది కాదని అతన్ని వెంకటరమణ వద్దకు తీసుకెళ్లాడు. ఎవరూ లేరని చెబుతుండడంతో ధనుష్‌ను వెంకట రమణ తన ఇంటి వద్ద పనిలో పెట్టుకున్నాడు.  

సినిమాకు డబ్బు ఇవ్వలేదని.. 
ఈ క్రమంలో ధనుష్‌ ఓ రోజు సినిమాకు వెళ్లాలి.. రూ. 500 డబ్బు కావాలి అని బ్రిక్స్‌ ఫ్యాక్టరీ వద్దనున్న వెంకటరమణను అడిగాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అదే సమయంలో బ్రిక్స్‌ ఫ్యాక్టరీ యజమాని వెంకటరమణకు డబ్బులు ఇవ్వడాన్ని ధనుష్‌ గమనించాడు. అదే రోజు రాత్రి తనకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో వెంకటరమణను రాడ్‌తో కొట్టి   పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ మృతిచెందాడు.  

గాలించి పట్టుకున్నారు.. 
వెంకట రమణ కుమారుడు భరత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడు విజయవాడ, కైకలూరులో ఉన్నాడన్న సమాచారం రావడంతో ఒంటిమిట్ట పోలీసులు వారం రోజుల పాటు కైకలూరులో గాలించారు.  అక్కడ నుంచి కడపకు వచ్చాడని  సమాచారం వచ్చింది. దీంతో కడప  పాత బస్టాండు రూబి లాడ్జ్‌ వద్ద సోమవారం ధనుష్‌ను పట్టుకున్నారు.  

నిందితుడు పాత నేరస్తుడే... 
నిందితుడు ధనుష్‌  స్వస్థలం కృష్ణా జిల్లా మండపల్లి మండలంలోని  చావలపాడు గ్రామం. ఇతడు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులు, నగదు, వాహనాలను దొంగలించేవాడు. కాగా వెంకటరమణ హత్యకు ఉపయోగించిన రాడ్‌తో పాటు 10 సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని రోజులు పరారీలో ఉన్న ధనుష్‌ను పట్టుకోవడంలో  సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ సంజీవరాయుడు, హెడ్‌ కానిస్టేబుళ్లు హరి, రమేష్, కానిస్టేబుల్‌ సునిల్‌ కృషి చేశారు. పోలీసులను డీఎస్పీ అభినందించారు. 
 

మరిన్ని వార్తలు