ఇంటి దొంగల బాగోతం బట్టబయలు 

3 Oct, 2020 07:53 IST|Sakshi

అనంతపురం విద్య: జేఎన్‌టీయూ అనంతపురంలోని సెంట్రల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌లో 24 ఇన్వర్టర్ల బ్యాటరీలను తరలిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు శుక్రవారం పట్టుబడ్డారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌లో వందలాదిగా కంప్యూటర్లు, ఇన్వర్టర్లు ఉన్నాయి. ముగ్గురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వీటిని ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నారు. సెంట్రల్‌ ల్యాబ్‌ తాళాలను పోలిన తాళాలను తయారు చేయించారు. కళాశాల తెరవక ముందే మరో తాళం చెవితో తలుపులు తీసి రోజూ రెండు ఇన్వర్టర్లను తీసుకెళ్లారు. ఇదే తరహాలోనే శుక్రవారం తాళం వేసినట్లుగానే ఉంది. కానీ ఇన్వర్టర్లను తీసుకెళ్తున్న వైనంపై సెంట్రల్‌ ల్యాబ్‌ పక్కన ఉన్న కోవిడ్‌ సెంటర్‌లో ఉంటున్న  బాధితులకు అనుమానం వచ్చింది.

దీంతో శుక్రవారం ఉదయం సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు పంపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కళాశాలకు వచ్చి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా ఇంటి దొంగల బోగోతం బట్టబయలైంది. ఇటీవల 24 కొత్త ఇన్వర్టర్ల బ్యాటరీలను బై బ్యాక్‌ ఆర్డర్‌ ఇచ్చారు. బై బ్యాక్‌ అంటే పాతవి వెనక్కి తీసుకొని కొత్త ఇన్వర్టర్లు ఇస్తారు. దీంతో పాత ఇన్వర్టర్‌ బ్యాటరీలన్నీ ఒకేచోట ఉంచారు. వీటిని రోజూ తీసుకెళ్తూ చివరి రోజు దొరికిపోయారు. ఈ వ్యవహారంపై జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగాధిపతి తెలిపారు.  

కలికిరిలోనూ నాలుగు ల్యాప్‌టాప్‌లు మాయం .. 
కలికిరి ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ నాలుగు హైకాన్‌ఫిగరేషన్‌ గల ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లు మాయమయ్యాయి. ఒక్కో ల్యాప్‌టాప్‌ రూ.  లక్ష విలువ చేస్తాయి. మొత్తం రూ.4 లక్షలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు దసాల్ట్‌ ల్యాబ్‌లో కనిపించలేదనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే విచారణకు ఆదేశించారు. 

మరిన్ని వార్తలు