రైలు పట్టాలే యమపాశాలు

3 Jun, 2021 08:18 IST|Sakshi

2020లో రైల్వే ట్రాకులపై 8,733 మంది మృతి 

వీరిలో అత్యధికులు వలస కార్మికులే: రైల్వే శాఖ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల 2020లో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. చాలామంది నగరాలు, పట్టణాల నుంచి కాలినడకన సొంతూళ్లకు పయనమయ్యారు. రైలు పట్టాలపై నడక సాగించారు. రైళ్లు ఢీకొట్టడం వల్ల, అనారోగ్యంతో వలస కార్మికులు పట్టాలపైనే ప్రాణాలు విడిచారు. గత ఏడాది దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 8,733 మంది మృతి చెందారని, వీరిలో అత్యధిక శాతం మంది వలస కార్మికులేనని రైల్వే బోర్డు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే బోర్డు తాజాగా సమాధానమిచ్చింది.

పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 2020లో జనవరి నుంచి డిసెంబర్‌ వరకు రైలు పట్టాలపై 8,733 మంది మరణించారని, 805 మంది గాయపడ్డారని పేర్కొంది. రోడ్లతో పోలిస్తే రైల్వే మార్గాలపై ప్రయాణం తక్కువ దూరం కావడంతో వలస కార్మికులు వీటినే ఎంచుకున్నారని, పట్టాలపై కాలిన నడకన వెళ్తూ చాలామంది మార్గంమధ్యలో వివిధ కారణాలతో మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై పోలీసుల నిఘా అధికంగా ఉండడంతో చాలామంది రైల్వే ట్రాకులపై నడుస్తూ సొంతూళ్లకు పయనమయ్యా రని అన్నారు.

దేశవ్యాప్తంగా 70 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాకులు విస్తరించి ఉన్నాయి. నిత్యం 17 వేల రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. 2016, 2017, 2018, 2019తో పోలిస్తే 2020లో రైలు పట్టాలపై చోటుచేసుకున్న మరణాలు తక్కువేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 2016లో 14,032 మంది, 2017లో 12,838 మంది, 2018లో 14,197 మంది, 2019లో 15,204 మంది రైలు పట్టాలపై ప్రాణాలు విడిచారు.

(చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్‌)

మరిన్ని వార్తలు