9 లక్షల నకిలీ నాణేలు పట్టివేత

3 Feb, 2023 13:31 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

ముంబయిలో 9 లక్షలకు పైగా నకిలీ నాణేలు పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు జాయింట్‌  ఆపరేషన్‌ చేసి ముంబయిలోని మలద్‌ ప్రాంతంలో నకిలీ నాణేలను చలామణి చేస్తున్న నిందితున్ని పట్టుకుని 9 లక్షలకుపైగా నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలో జరుగుతున్న నకిలీ నాణేల చలామణిపై ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ బృందం తమకు సమాచారం అందించారని, వారితో కలిసి బుధవారం రాత్రి జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టి నిందితుణ్ణి పట్టుకుని నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. పట్టుబడ్డవాటిలో రూపాయి, రూ.5, రూ.10 విలువ కలిగిన 9.46లక్షల పాత నకిలీ నాణేలు ఉన్నాయి.

ఈ నకిలీ నాణేల తయారీ కేంద్రాన్ని హర్యానాలో నిర్వహిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ అధికారులు ఇదివరకే దాడులు నిర్వహించి ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ నాణేలను ముంబయిలో చలామణి చేస్తున్నట్లు  తెలిసిన సమాచారంతో ముంబయిలో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

దేవాలయాలే అడ్డా
సాధారణంగా నకిలీ కరెన్సీ నోట్ల చలామణి, పట్టివేత గురించి మనం తరచూ వింటుంటాం. అయితే ఇటీవల కాలంలో నకిలీ నాణేల చలామణి కూడా ఎక్కువైంది. భారీ మొత్తంలో తయారు చేసిన నకిలీ నాణేలను దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద చలామణి చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు