ఏసీబీ వలలో ఎంపీడీవో 

13 Sep, 2022 04:56 IST|Sakshi
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంపీడీఓ విజయ

రూ.40 వేల లంచం తీసుకున్న పి.గన్నవరం ఎంపీడీవో విజయ 

పి.గన్నవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో కె.ఆర్‌.విజయ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎంపీ ల్యాడ్స్‌ మంజూరు కోసం మండల పరిషత్‌ నుంచి 10 శాతం మ్యాచింగ్‌ గ్రాంటు ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మండలంలోని రాజులపాలెంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రూ.1.15 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహించాలని పంచాయతీలో నిర్ణయించారు.

ఎంపీ లాడ్స్‌ మంజూరుకు ముందుగా గ్రామ పంచాయతీ నుంచి 10 శాతం, మండల పరిషత్‌ నుంచి 10 శాతం సొమ్ము మ్యాచింగ్‌ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంది. మండల పరిషత్‌ మ్యాచింగ్‌ గ్రాంటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉప సర్పంచ్‌ ఎన్‌.విజయలక్ష్మి ఇటీవల ఎంపీడీవో విజయను కోరారు. అనుమతి ఇచ్చేందుకు ఎంపీడీవో రూ.50 వేలు డిమాండ్‌ చేశారు.

ఈ నెల 6న విజయలక్ష్మి ఎంపీడీవోకు రూ.10 వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్ము కూడా ఇవ్వాలని ఎంపీడీవో ఒత్తిడి చేయడంతో ఉప సర్పంచ్‌ తమను ఆశ్రయించినట్టు ఏసీబీ ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయలక్ష్మి నుంచి రూ.40 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో విజయను పట్టుకున్నట్టు చెప్పారు.

తమ పరీక్షల్లో ఎంపీడీవో నగదు తీసుకున్నట్టు నిర్ధారణ అయిందన్నారు. ఎంపీడీవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అరెస్టు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో సీఐలు వి.పుల్లారావు, బి.శ్రీనివాస్, వై.సతీ‹Ù, ఎస్‌ఐ ఎస్‌.విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు