ఈ ధాన్యం ఎవరిది? 

21 Aug, 2020 02:43 IST|Sakshi
మిల్లులో భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం బస్తాలు  

వనపర్తిలోని రైస్‌ మిల్లులో భారీగా వరి ధాన్యం బస్తాలు నిల్వ

మిల్లుకు సీల్‌ వేసిన అధికారులు

వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలోని కేదార్‌నాథ్‌ రైస్‌ మిల్లులో భారీ మొత్తంలో వరి ధాన్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వనపర్తి తహసీల్దార్‌ రాజేందర్‌గౌడ్, పౌరసరఫరాల శాఖ డీఎం అశ్విన్‌కుమార్‌ గురువారం వనపర్తి పట్టణంలోని కేదార్‌నాథ్‌ రైస్‌ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. వీరి పరిశీలనలో పెద్ద మొత్తంలో వరి ధాన్యం బస్తాల నిల్వలు గుర్తించారు. అలాగే 200 క్వింటాళ్లకు పైగా బియ్యం అక్రమంగా ఉన్నట్టు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని మిల్లుకు సీల్‌ వేశారు.  

ఆరా తీస్తున్న అధికారులు 
ఈ మిల్లుకు గత ఖరీఫ్‌ సీజన్‌లో 21వేల బస్తాల వరి ధాన్యం అప్పగించారు. కాగా ఈ మిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 300 బస్తాల (150 క్వింటాళ్ల) బియ్యం మాత్రమే అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లులో భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం, 150 క్వింటాళ్ల బియ్యం ఎక్కడిదని అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో అక్రమ దందాకు పాల్పడిన వారే ఇక్కడ నిల్వ చేశారా.. లేదా మిల్లు యాజమాన్యమే నిల్వ చేసిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. లెక్కల్లో చూపని దాదాపు లక్ష వరి బస్తాల ధాన్యం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై డీఎస్‌ఓ రేవతిని వివరణ కోరగా కేదార్‌నాథ్‌ మిల్లు 150 క్వింటాళ్ల బియ్యం అప్పగించాల్సి ఉందన్నారు. అయితే ఇంత భారీగా ఉన్న వరి ధాన్యం నిల్వలు ఎవరివో విచారణ చేస్తున్నామన్నారు. అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు