రూ.100కి 20 రూపాయల వడ్డీ.. దిక్కుతోచని స్థితిలో..

4 Jun, 2022 18:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): క్రికెట్‌ బెట్టింగ్‌ ఓ వ్యక్తి  ప్రాణాలను తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేసిన అప్పులకు వందకు రూ.20 వడ్డీ చెల్లించలేక ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిట్టినగర్‌ సొరంగం వద్ద జరిగింది. ఘటనపై  మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
చదవండి: కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి..

పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్‌ సొరంగం సమీపంలోని కటికల మస్తాన్‌ వీధికి చెందిన జొన్నలగడ్డ బాలస్వాతి, శ్రీనివాసరావు(42) భార్యాభర్తలు. వీరికి అన్నపూర్ణ, అజయ్‌కుమార్‌  సంతానం. శ్రీనివాసరావు పెయింటింగ్‌ పని చేస్తూ క్రికెట్‌ బెట్టింగులు ఆడుతుంటాడు. బాలస్వాతి పంజా సెంటర్‌లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటుంది.  గత కొద్ది రోజులుగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసరావుకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. వందకు రూ.20 చొప్పున వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో అర్ధం కాక మానసికంగా కుంగిపోయాడు.

గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్యూషన్‌ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తండ్రిని చూసి భయంతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శుక్రవారం ఉదయం మృతుని నివాసానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.     

మరిన్ని వార్తలు