-

'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్‌

7 Nov, 2021 05:01 IST|Sakshi
పల్లె రఘునాథరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సతీష్‌ యాదవ్‌

వైఎస్సార్‌సీపీ నేతపై దుష్ప్రచారం చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తకు టీడీపీ మాజీ మంత్రి పల్లె సలహా

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఆడియో

పోలీసులకు ఫిర్యాదు 

పుట్టపర్తి: అధ్యాపకుడిగా పిల్లలకు నీతులు బోధించిన టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ నేతగా తాను మాత్రం నీతిమాలిన చర్యలకు ఒడిగట్టారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతపై తప్పుడు కేసు పెట్టాలంటూ ఒక అంగన్‌వాడీ కార్యకర్తకు సలహా ఇస్తున్న ఆడియో శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎద్దులవాండ్లపల్లి మినీ అంగన్‌వాడీ కార్యకర్త అనసూయ విధులకు తరచూ గైర్హాజరవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని కూడా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరిగా పంపిణీ చేయడం లేదు.

ఈ విషయంపై స్థానికుల విజ్ఞప్తి మేరకు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సతీష్‌ యాదవ్‌ కొన్ని రోజుల క్రితం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గంగాదేవికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అనసూయ ఫోన్‌లో టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై పల్లె ఆమెకు తప్పుడు సలహాలు ఇచ్చారు. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకుంటున్నట్లుగా ఓ వీడియో రికార్డ్‌ చెయ్‌. సీఎం గారూ.. మీరు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నారు.. కానీ మా ఊర్లో సతీష్‌ యాదవ్‌ అనే వ్యక్తి నన్ను వేధిస్తున్నాడు, నాకు లొంగి కోరిక తీర్చాలి.. లేదంటే నీ ఉద్యోగం పీకించేస్తా అంటూ భయాందోళనకు గురిచేస్తున్నాడు.

అతడి నుంచి నాకు రక్షణ కల్పించండి.. లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని రికార్డు చెయ్‌.. ఆ వీడియో వైరల్‌ చెయ్‌.. దీన్ని సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు రూపంలో అందజేయి’ అంటూ పల్లె రఘునాథరెడ్డి అంగన్‌వాడీ కార్యకర్తకు చెప్పడం ఆ ఆడియోలో బట్టబయలైంది. ఇది విన్న పలువురు విద్యావేత్తగా చెప్పుకునే పల్లె రఘునాథరెడ్డి చెప్పాల్సిన మాటలేనా ఇవి? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా అంగన్‌వాడీ కార్యకర్త విషయంలో స్థానిక ఎంపీడీవో ఆజాద్‌ తనకు ఫోన్‌ చేసి బెదిరించారంటూ సతీష్‌ యాదవ్‌ నల్లమాడ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు