ఉద్యోగమే నా చావుకు కారణం

18 Mar, 2021 05:34 IST|Sakshi
కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న జగన్నాథ్‌ (ఫైల్‌)

ఆత్మహత్య చేసుకున్న పంచాయతీ జూనియర్‌ కార్యదర్శి

సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలో ఘటన

తన చావుతోనైనా సమస్యలు పరిష్కరించాలని సూసైడ్‌ నోట్‌

జోగిపేట(అందోల్‌): సంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్కల్‌ మండలం ఇసోజిపేటకు చెందిన ఎం.జగన్నాథ్‌ మిన్పూర్‌ గ్రామ పంచాయతీ జూనియర్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అనేక ఒత్తిడులు, అవమానాలు భరించలేక ‘నా చావుకు నా ఉద్యోగమే కారణం’అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘నేను పనిచేస్తున్న గ్రామానికి చెందిన నాయకులు పలువురికి మద్యం తాగించి నాతో గొడవకు ఉసిగొల్పుతున్నారు. వాళ్ల చిల్లర రాజకీయాలు భరించలేకపోయాను.

గ్రామ ఇన్‌చార్జి సర్పంచ్, 7వ వార్డు సభ్యుడు తమకు సహకరించలేదని, చాలా వేధింపులకు గురి చేశారు. మార్చి 3న ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అధికారులకు లేఖ ఇచ్చాను. తోటి ఉద్యోగులు, అధికారులు నచ్చచెప్పడం.. అలాగే ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గరే ఉంటే అమ్మానాన్నలకు బాధ కలుగుతుందని భావించి మళ్లీ విధుల్లో చేరాను. అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి’అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నా డు. ‘ఏపీవో నన్ను కుక్కలా తిప్పుకున్నారే కానీ, ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు చేయించిన పనులకు పేమెంట్స్‌ ఇవ్వలేదు. నర్సరీ పనులకు, బ్యాగ్‌ ఫిల్లింగ్, పోల్స్‌ ఫిట్టింగ్, నర్సరీలోని లేబర్‌కు, ఆడిటింగ్‌లకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. నా చావుతోనైనా సమస్యలు పరిష్కరించాలి. నాకు బతకాలని ఉన్నా, ఇలా బతకడం నావల్ల కావడం లేదు’అంటూ సూసైడ్‌ నోట్‌ ముగించాడు.  

అధైర్యపడొద్దు...
పంచాయతీ కార్యదర్శులు అధైర్యపడవద్దు. సమస్యలుంటే ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందాం. గ్రామా ల్లో రాజకీయంగా ఇబ్బందులుంటే అధి కారుల దృష్టికి తీసుకెళ్లాలి. జగన్నాథ్‌ ఆత్మహత్య చాలా బాధాకరం.
–ఎస్‌.రమేశ్, జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు