ఉద్యోగం నుంచి తొలగించారని..  ఉరి వేసుకున్నాడు

21 Jul, 2022 00:48 IST|Sakshi
ఆకుల రామదాసు  

పంచాయతీ కార్మికుడి విషాదాంతం

ఉద్యోగం నుంచి తొలగించిన సర్పంచ్‌ భర్త 

గ్రామస్తుల ఆగ్రహం.. 

బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మృతదేహంతో ఆందోళన 

కోనరావుపేట(వేములవాడ): ముప్పై ఏళ్లుగా చేస్తున్న పనిలోంచి అకారణంగా తొలగించడంతో మనస్తాపానికి గురైన పంచాయతీ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే కార్మికుడి మృతికి కారణమైన సర్పంచ్, సర్పంచ్‌ భర్తను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేటలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన ఆకుల రామదాసు(68) గ్రామపంచాయతీలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న ఉపాధిహామీ పనుల పరిశీలనకు గ్రామానికి కేంద్ర బృందం రాగా..గ్రామస్తులు అడ్డుకుని సర్పంచ్, సర్పంచ్‌ భర్తపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన సర్పంచ్‌ లత భర్త ఆరె మహేందర్‌ పంపు ఆపరేటర్‌ రామదాసును దుర్భాషలాడుతూ విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు.

వరుసగా మూడ్రోజులు మహేందర్‌ దగ్గరికి వెళ్లి బతిమిలాడినా వినిపించుకోకపోవడంతో మనస్తాపం చెందిన రామదాసు బుధవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని జామచెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  

గ్రామస్తుల ఆగ్రహం 
సర్పంచ్, సర్పంచ్‌ భర్తను శిక్షించాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహా రం అందించాలంటూ గ్రామస్తులు ఆందోళనబాట చేపట్టారు.  వేములవాడ ఆర్డీవో లీలావతి, డీఎల్పీవో మల్లికార్జున్‌ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు