పంచాయతీరాజ్‌ ఏఈ కేసులో కొత్త కోణం

30 Jan, 2021 08:36 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు

బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఐదుగురు అరెస్టు

మరొకరు పరారీలో..

సాక్షి, ఆదిలాబాద్‌: పంచాయతీరాజ్‌ ఏఈ చంద్రశేఖర్‌ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. ఏఈ చంద్రశేఖర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిపి.. పంచాయతీరాజ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నవీన్‌ జాదవ్, విద్యార్థి రమేశ్‌ ఇరువురు కలిసి ఏఈ సోదరుడైన ఉపాధ్యాయుడు తాడిచర్ల రఘునాథ్‌ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరగవచ్చని మాయమాటలు చెప్పి నమ్మబలికారు. ఆయన ఇంట్లోని ఆస్తి దస్త్రాలు, ఎల్‌ఐసీ బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో వన్‌టౌన్‌లో తాడిచర్ల రఘునాథ్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ ఎన్‌.రామకృష్ణ, ఎస్సై జి.అప్పారావు, జాదవ్‌ గుణవంత్‌రావు ఒక్క రోజులోనే దర్యాప్తు చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి, వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. సీఐ ఎన్‌.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీరాజ్‌ ఏఈ చంద్రశేఖర్‌ ఏసీబీ అధికారులకు చిక్కడంతో అదే శాఖలో పనిచేస్తున్న నవీన్‌ జాదవ్, విద్యార్థి రమేశ్‌తో కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారన్నారు. కుట్రలో భాగంగా ఇరువురు కలిసి స్థానిక పాత హౌసింగ్‌బోర్డు కాలనీలోని చంద్రశేఖర్‌ సోదరుని ఇంటికివెళ్లి మాయమాటలు చెప్పి ఆస్తికి సంబంధించిన దస్త్రాలు ఎత్తుకెళ్లారు. 

అనంతరం ఫోన్‌ ద్వారా రఘునాథ్‌ను బెదిరించి దస్త్రాలు కావాలంటే దస్త్రాల విలువలో 20 శాతం తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్థానిక సివిల్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ ద్వారా ఫోన్‌ చేసి బెదిరించ సాగారు. ఆయన నుంచీ ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక భుక్తాపూర్‌ కాలనీలోని ఐటీ కన్సల్టెంట్‌ నరోత్తంరెడ్డిని సంప్రదించి ఆయన ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విధంగా నలుగురని కుట్రలో భాగస్వామ్యం చేసి రఘునాథ్‌ను బూతులు తిడుతూ బెదిరించారు. తరుచూ ఫోన్‌ రావడంతో వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు అనంతరం ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఆరుగురు నిందితులు కుట్రలో భాగస్వాములు అయినట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశామన్నారు. కుట్రకు పాల్పడిన పంచాయతీరాజ్‌ శాఖ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నవీన్‌ జాదవ్, విద్యార్థి బొడ్డెండ్ల రమేశ్, సివిల్‌ కాంట్రాక్టర్‌ బొడ్డెండ్ల శ్రీనివాస్, ఐటీ కన్సల్టెంట్‌ నరోత్తంరెడ్డి, జనగాం సంతోష్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్లు డీఎస్పీ వివరించారు. ఆరో ముద్దాయి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బాలు జైస్వాల్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆరుగురుపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు