నా తమ్ముడి జీవితం నాశనం చేశారు; అసభ్య చర్య వల్లే!

12 Sep, 2020 14:55 IST|Sakshi

మైనార్టీ అయినందుకే నా తమ్ముడికి ఈ గతి

ఏడేళ్ల పిల్లాడిపై లైంగిక దాడికి యత్నించాడు

చండీగఢ్‌: ‘‘ఏదైనా పని చేసుకుని పొట్టపోసుకుందామని అక్కడకు వెళ్లాడు. కానీ ఇలా తన చేతిని నరికేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ముస్లిం అయినందుకే నా తమ్ముడికి ఈ గతి పట్టింది’’... ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇక్రమ్‌ సల్మానీ ఆవేదన ఇది.  ఉపాధి వెదుక్కుంటూ హర్యానాలోని పానిపట్‌కు చేరుకున్న తన తమ్ముడు ఇఖ్లక్‌ సల్మానీని స్థానికులు తీవ్రంగా తిట్టి, కొట్టి నరకం చూపించి, అనంతరం రైల్వేట్రాక్‌ పక్కన పడేశారని అతడు ఆరోపించాడు. మైనార్టీలు అయినందు వల్లే తమకు ఇంతటి దుస్థితి పట్టిందంటూ ఆగష్టు 23న చోటుచేసుకున్న అమానుష ఘటన గురించి ఓ జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు.

అయితే ఇఖ్లక్‌ చేయి నరికినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబం మాత్రం ఇక్రమ్‌ వ్యాఖ్యలను ఖండించింది. ఇంట్లో నిద్రిస్తున్న తమ చిన్నారిని ఎత్తుకువెళ్లి లైంగిక దాడికి యత్నించినందుకే ఆవేశంలో అతడిని కొట్టామని, అంతకు మించి తామేమీ చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఘటన జరిగిన సుమారు 14 రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 7న వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే ఇఖ్లక్‌ అత్యాచారయత్నం చేశాడా? లేదా మైనార్టీ అయినందుకే అతడిపై దాడికి ఒడిగట్టారా అన్న అంశం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

బాధితుడు ఇఖ్లక్‌ సోదరుడు ఇక్రమ్‌ వెల్లడించిన వివరాల మేరకు.. ‘‘యూపీలో.. సహరన్‌పూర్‌ నుంచి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో గల ననౌతాలోని ఇంటి నుంచి ఇఖ్లక్‌ పానిపట్‌కు బయల్దేరాడు. అయితే కిషన్‌పురా ప్రాంతానికి చేరుకునే సరికి చీకటి పడింది. పైగా తనకు అక్కడ తెలిసిన వాళ్లెవరూ లేకపోవడంతో ఓ పార్కులో నిద్రించేందుకు సిద్ధమయ్యాడు. అంతలో అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు పార్కు నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఇఖ్లక్‌కు సూచించారు. ఆ తర్వాత తన పేరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే వెంటనే అసభ్య పదజాలంతో దూషిస్తూ, తీవ్రంగా కొట్టారు. దీంతో ఇఖ్లక్‌ అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గొంతు ఎండుకపోవడంతో సమీపంలో ఉన్న ఇంటి తలుపు తట్టి నీళ్లు కావాలని అడిగాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ ఇల్లు తనను కొట్టినవాళ్లదే. అక్కడ ఇఖ్లక్‌ను చూడగానే వాళ్లు మరింతగా రెచ్చిపోయారు.

ఇంట్లోకి లాక్కెళ్లి మరోసారి పాశవికంగా దాడి చేశారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అంతా కలిసి కర్రలతో ఇఖ్లక్‌ను కొట్టి, తలపై బండరాయితో మోదారు. రక్తం వచ్చేలా హింసించారు. తనను వదిలేయమని ఎంతగా ప్రాధేయపడినా కనికరించలేదు. నిజానికి నా తమ్ముడి చేతిపై ఉన్న ‘786’ టాటూ చూడగానే వారి కోపం ఇంకా పెరిగింది. అందుకే తన కుడిచేతిని శరీరం నుంచి వేరు చేయాలని భావించారు. వెంటనే రంపం తెచ్చి చేతిని కోసేశారు. ఆ తర్వాత తనను కిషన్‌పురా రైల్వేట్రాక్‌ దగ్గర పడేశారు. చచ్చిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు’’అని ఇక్రమ్‌ సల్మానీ తీవ్ర ఆరోపణలు చేశాడు. మరుసటి రోజు ఉదయం కొంతమంది వ్యక్తులు తన తమ్ముడి పరిస్థితిని గమనించి.. తమకు సమాచారం అందించాడని చెప్పుకొచ్చాడు. 

ఇందుకు సంబంధించి చాందినీ బాగ్‌ పోలీస్‌ స్టేషనులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, హర్యానా ప్రభుత్వ ఒత్తిడి వల్ల పోలీసులు సరిగా విచారణ చేయడం లేదని ఆరోపించాడు. ఘటన జరిగిన చోటుకు వెళ్లి తను ఆరా తీశానన్న ఇక్రమ్‌.. ‘‘వాళ్లు నిజమే చెప్పారు. ఆగష్టు 23న నా తమ్ముడిని కొంతమంది దారుణంగా కొట్టారని చెప్పారు. వాళ్లు కేవలం నా తమ్ముడి చేతిని నరకలేదు. వాడి జీవితాన్ని, వాడి కలలను నాశనం చేశారు’’ అని ఆవేదన చెందాడు.

నగ్నంగా మార్చి.. వికృత చర్యలకు పాల్పడ్డాడు
ఇక తమపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన స్థానిక కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘నా పక్కనే నిద్రిస్తున్న నా కజిన్‌ కొడుకైన ఏడేళ్ల పిల్లాడిని అతడు పార్కుకు తీసుకువెళ్లాడు. తనని నగ్నంగా మార్చి అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. మేం వెళ్లేసరికి చిన్నారితో వికృతంగా ప్రవర్తిస్తూ కంటపడ్డాడు. ఆగ్రహం పట్టలేకపోయాం. మేం తన చేతిని నరకలేదు’’అని చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా ఇఖ్లక్‌ తన పళ్లు రాలగొట్టి పరారయ్యాడని చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి స్థానిక పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఇక ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎస్సై ఇఖ్లక్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ప్రాథమిక విచారణలో తేలినట్లు వెల్లడించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు