Punjagutta: రూ.కోట్ల ఆస్తి ఉంది.. నిన్ను పెళ్లి చేసుకుంటా

14 Aug, 2021 08:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 యువతిని మోసం చేసిన యువకుడు

 కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సాక్షి, పంజగుట్ట: ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకొని, కోట్ల రూపాయల ఆస్తి ఉంది.. నిన్ను పెళ్లి చేసుకుంటా.. ఇద్దరం జీవితాంతం సంతోషంగా ఉందామని మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన యువకుడిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఆదిత్యకు సోమాజిగూడకు చెందిన బీటెక్‌ పూర్తిచేసిన ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి నెల రోజులు సహజీవనం చేశారు. మాస్టర్స్‌ చదివేందుకు యువతి జనవరి 13న అమెరికాకు వెళ్లింది. ప్రతి రోజూ ఆమెకు ఫోన్‌ చేసి ఇండియాకు రావాలని, తనపేరుమీద రూ.13 కోట్ల ఫిక్స్‌డిపాజిట్లు ఉన్నాయని, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని నమ్మబలికాడు.

నమ్మిన యువతి ఫిబ్రవరి 12వ తేదీన చదువు ఆపేసి ఇండియాకు వచ్చింది. మణికొండలో ఇల్లు తీసుకుని ఉన్నారు. ఇద్దరూ కలిసి టూర్‌ వెళ్లి జూలైలో నగరానికి వచ్చారు. తర్వాత ఇల్లు బంజారాహిల్స్‌కు మార్చారు. బెంగళూరుకు వెళ్లి డబ్బులు తీసుకు వస్తానని చెప్పి ఆదిత్య వెళ్లాడు. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ముఖం చాటేశాడు. దీంతో యువతి పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

వివాహిత ఆత్మహత్య
పంజగుట్ట: వరకట్న వేధింపులకు యువతి బలైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈస్ట్‌గోదావరి జిల్లా పైడికొండకు చెందిన పి.గంగబాబుకు శివకుమారి(24), శంకరవేణి ఇద్దరు కుమార్తెలు. శివకుమారిని అదే ప్రాంతానికి చెందిన కె.శ్రీనివాస్‌(35)కి ఇచ్చి వివాహం చేశారు. రూ.2 లక్షల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు కట్నం కింద ఇచ్చారు. అనంతరం శ్రీనివాస్‌ నగరంలోని శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటూ కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. అదనపు కట్నం తీసుకురావాలని శివకుమారిని తరచూ శ్రీనివాస్‌ వేధించేవాడు. ఈ క్రమంలో ఆర్నెళ్ల క్రితం గ్రామంలోని 5 సెంట్ల భూమిని శ్రీనివాస్‌కు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో గురువారం శివకుమారి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్‌ అతడి తల్లి బాలమ్మపై వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు