అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం

22 Mar, 2021 15:23 IST|Sakshi

సీబీఐ విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌

హోంమంత్రిపై మాజీ కమిషనర్‌ సంచలన ఆరోపణలు

సాక్షి, ముంబై: రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటింముందు పేలుడు పదార్థాలతో  దర్శనమిచ్చిన వాహనం వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ కేసులో రోజుకో పరిణామంతో, బీజేపీ, శివసేనల మాటల యుద్ధం వాహన యజమాని మన్సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద మరణం తరువాత మరింత ముదురుతోంది. తాజాగా తన బదిలీని వ్యతిరేకిస్తూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమబీర్‌ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను హోం గార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేశారు.  మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరపాలని ఈ సందర్భంగా ఆయనడిమాండ్‌ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసేందుకు తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు నాశనం చేయకముందే. తన ఆరోపణలపై  హోంమంత్రిపై  న్యాయమైన దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ  తనకు రక్షణకు కల్పించాల్సిందిగా  కోరారు. (వాజే టార్గెట్‌ వంద కోట్లు)

మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 17 న సింగ్‌ను  బదిలీ చేసి, మహారాష్ట్ర డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి హేమంత్ నాగ్రేల్‌ను కొత్తగా నియమించింది.  దీంతో హోమ్ గార్డ్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పరమ్‌బీర్‌ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు కమిషనర్‌ బాధ్యతలనుంచి తొలగించిన అనంతరం  సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు. హిరేన్‌  మృతి కేసులో ఎన్ఐఏ అదుపులో ఉన్న సచిన్ వాజే, ఇతర పోలీసు అధికారులను రూ .100 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కోరినట్లు ఈ లేఖలో ఆరోపించారు. ముంబైలోని బార్స్ , రెస్టారెంట్ల నుండి నెలవారీ రూ .50 కోట్ల నుండి 60 కోట్ల వరకు వసూలు చేయాలని కోరారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్‌ ఖండించారు. 

హోంమంత్రి రాజీనామా చేసే ప్రసక్తేలేదు : శరద్ ‌పవార్‌
అటు పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. దేశ్‌ముఖ్‌ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 5నుండి 15 వరకు ఆసుపత్రిలో ఉన్నారు, ఫిబ్రవరి 15 నుండి 27 వరకు అతను నాగ్‌పూర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  దీనికి సంబంధించిన వివరాలను, రికార్డులన్నింటినీ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో అందించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ్‌ముఖ్ రాజీనామాకు సంబంధించి సేన నుండి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. రాజ్యసభలో బీజేపీ ఎంపీలు ఇదే అంశంపై చర్చ చేయాలని డిమాండ్ చేయగా, లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. కాగా ఫిబ్రవరి 25 న అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ఉంచడంలో వాజే ఆరోపించిన పాత్రను ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు