మూఢనమ్మకంతోనే.. బలిచేశారు

26 Jan, 2021 08:29 IST|Sakshi

స్వర్గాన్ని నాశనం చేసేశారు ! 

పోలీసులు, సన్నిహితులతో తల్లి వాగ్వాదం

తల్లిదండ్రులే కూతుళ్లను కడతేర్చిన వైనం

మూడో వ్యక్తి ప్రమేయంపై పోలీసుల ఆరా 

కొలిక్కిరాని మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసు 

మదనపల్లె: ‘మహాద్భుతంగా ఉన్న స్వర్గాన్ని నాశనం చేశారు. అరగంట ఆగితే నా బిడ్డలు సంతోషంగా బతికి వచ్చేవారు. పూజాఫలాన్ని మొత్తం నా భర్తే నాశనం చేశారు. లేకపోతే నాకు ఈ కర్మ వచ్చేది కాదు’ అంటూ పాశవికంగా కన్నబిడ్డలను హత్యచేసిన పద్మజ వాదించడం విస్మయానికి గురిచేసింది. ఆదివారం రాత్రి పట్టణంలోని శివనగర్‌లో నివాసం ఉంటున్న ఉమెన్‌ డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్‌ పురుషోత్తం నాయుడు, ఆయన భార్య పద్మజ క్షుద్రపూజల పేరుతో తమ కుమార్తెలు అలేఖ్య(27), సాయిదివ్య(22)ను ఇంట్లో కిరాతకంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం మృతదేహాలకు బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి వల్లేరు పురుషోత్తం నాయుడు పిల్లల అంత్యక్రియలకు హాజరై మృతదేహాలకు నిప్పంటించి సాగనంపారు. తల్లి పద్మజను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి తీసుకువచ్చినా దూరంగా ఉంచారు.

ఆగస్టు 14న గృహప్రవేశం 
తవణంపల్లె మండలం కొండ్రాజుకాలువకు చెందిన పురుషోత్తం నాయుడు, చిత్తూరు పట్టణానికి చెందిన పద్మజ దంపతులు పాతికేళ్ల క్రితం మదనపల్లెకు వచ్చారు. పురుషోత్తం నాయుడు పీహెచ్‌డీ ఇన్‌ కెమిస్ట్రీ పూర్తిచేసి ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భార్య పద్మజ మాస్టర్‌మైండ్స్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా 23 ఏళ్ల నుంచి ఎందరో విద్యార్థుల భవిష్యత్‌కు బంగరుబాటలు వేశారు. ఇద్దరు కుమార్తెలు అంటే తల్లిదండ్రులకు విపరీతమైన ప్రేమ. ఇద్దరినీ ఉన్నత చదువులు చదివించారు. పెద్దమ్మాయి అలేఖ్య భోపాల్‌లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌లో పనిచేస్తోంది.

చిన్నమ్మాయి సాయిదివ్య బీబీఏ పూర్తిచేసుకుని ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఆరు నెలల క్రితం వరకు ప్రశాంత్‌నగర్‌లోనే నివాసం ఉన్న ఈ కుటుంబం శివనగర్‌లో నూతనంగా ఇల్లు నిర్మించుకుని ఆగస్టు 14న గృహప్రవేశం చేసింది. ఇంట్లో చేరిన రోజు నుంచి ఏదో ఒక పూజ, వ్రతాలు చేస్తూనే ఉన్నారు. కరోనా కారణంగా బంధుమిత్రులను ఆహా్వనించకుండానే సింపుల్‌గా గృహ ప్రవేశం కానిచ్చారని, ఇంట్లో నుంచి పిల్లలు, తల్లి బయటకు వచ్చేవారు కాదని చుట్టుపక్కలవారు చెబుతున్నారు. కొత్త ఇంట్లో ఏదేని అనుకోని సంఘటన జరిగి ఉంటే కీడును శాంతింపజేసేందుకు ఎవరైనా క్షుద్రమాంత్రికులు పరిచయమై వారు వీరిని ఆ దిశగా ప్రేరేపించారా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
కరోనా శివుడి రోమాల్లో నుంచి పుట్టింది 
యువతుల హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఇంట్లోకి వెళితే తల్లి పద్మజ ‘అనవసరంగా హైరానా పడవద్దు.. నా బిడ్డలు లేచి వస్తారు. శక్తి చెప్పింది’ అని వాదించింది. విద్యావంతులు మీరిలా మాట్లాడడమేంటని పోలీసులు అంటే మీకు మాకన్నా తెలుసా..? కరోనా చైనాలో పుట్టిందనుకుంటున్నారా..? శివుడి రోమాల నుంచి పుట్టింది. శివుడే అన్నింటికీ సమాధానం చెబుతారని వింతగా మాట్లాడినట్లు తెలిసింది. పెద్దమ్మాయి అలేఖ్య ఇన్‌స్ట్రాగాం అకౌంట్‌ను ఓపెన్‌చేస్తే అందులో మూడురోజుల క్రితం ‘శివ ఈజ్‌ కమింగ్‌’ అంటూ పోస్ట్‌లు పెట్టింది.

పైగా పెద్దమ్మాయి నాలుగు రోజుల క్రితం పురుషోత్తం నాయుడు సహోద్యోగి ఇంటికి వెళితే ‘మీరు బుద్ధుడిలాగా ఉన్నారు.. మిమ్మల్ని కౌగిలించుకోవాలనుంది. మీ ఇంటికి తీసుకెళ్లండి అంకుల్‌’ అంటూ మారాం చేసినట్టు సమాచారం.   ఇన్‌స్ట్రాగాం పోస్ట్‌ల్లో ఆధ్యాతి్మకగురువు ఓషోను తనకు ఇష్టమైన వ్యక్తిగా పేర్కొంది. చనిపోయిన సమయంలో ఆమె పక్కనే మెహర్‌బాబా పుస్తకం ఉంది. ఇంట్లోనూ ఎక్కడ చూసినా షిర్డీసాయిబాబా, అవతార్‌ మెహర్‌బాబా, ఓషో పుస్తకాలు, ఫొటోలు కనిపించాయి. 4–5 రోజులుగా ఏవో పూజలు చేస్తున్నారని, అప్పుడప్పుడు కేకలు, అరుపులు వినిపించేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఆదివారం ఉదయం స్వామీజీ ఒకరు ఇంటికి వచ్చి ఇల్లంతా కలియదిరిగి మంత్రించిన నీళ్లను చల్లి నిమ్మకాయలు ఉంచి వెళ్లినట్లు తెలిసింది.
 
బిడ్డలను అతికిరాతకంగా కడతేర్చింది 
నాలుగు రోజులుగా ఇద్దరు కూతుళ్లకు మతిస్థిమితం లేదని, పూర్తిగా ట్రాన్స్‌ (అలౌకిక జగత్తు)లోకి వెళ్లిపోయారని, తనతోనూ సరిగ్గా మాట్లాడలేదని పురుషోత్తం నాయుడు తెలిపారు. పెద్దమ్మాయి అలేఖ్య తొమ్మిదో తరగతి నుంచే తాను శివస్వరూపాన్ని అని చెప్పేదన్నారు. తనకు మహిమలు ఉన్నట్లు తెలిపేదని పేర్కొన్నారు. చిన్నమ్మాయి సాయిదివ్య ఇంట్లో శక్తులు తిరుగుతూ, భయపెడుతున్నాయని, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రాధేయపడేదని, లేకపోతే డాబాపై నుంచి దూకేస్తానని చెప్పడంతో మూడు రోజులుగా కాపలా కాసినట్లు వెల్లడించారు. దివ్యను తనదారిలో తెచ్చుకునేందుకు అలేఖ్య లేనిపోని భయాలను కలిగించి మెల్లగా తన వశం చేసుకుందని చెప్పారు. అలేఖ్య చిన్నచిన్న మహిమలు చూపించడంతో అతీతశక్తులు ఆవహించినట్లు నమ్మానని చెప్పారు. అమ్మాకూతుళ్లు అర్ధనగ్నంగా ఆదివారం ఉదయం నుంచి శక్తిపూజలు చేశారన్నారు.

మధ్యలో  అలేఖ్య చెల్లిలో ఉన్న దుష్టశక్తిని చంపేస్తున్నామని చెప్పి తల్లితో కలిసి కత్తితో నుదుటిపై శక్తిపూజకు సంబంధించి ముగ్గువేస్తూ క్రూరంగా చంపేసినట్టు వెల్లడించారు. తర్వాత పసుపునీళ్లతో శుద్ధిచేసి వేపాకుమీద పడుకోబెట్టారని తెలిపారు. తర్వాత అలేఖ్య ఎరుపు వ్రస్తాలు ధరించి శక్తి తనను ఆవహించిందని, కలి అంతమైపోతోందని, నన్ను చంపాక చెల్లికి ఎలాగైతే చేశామో అవన్నీ తనకూ చేసి మంత్రాన్ని చదివితే చనిపోయిన చెల్లిని తీసుకువస్తానని చెప్పినట్టు తెలిపారు. పూజ జరిగేంతసేపు తనను గంట మోగించాల్సిందిగా ఆదేశించారని, పూజ గంటసేపు జరిగాక పెద్దకూతురు చెప్పిన విధంగా తన భార్య ఆమెను కడతేర్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్య పూజలో ఉండగానే.. కొంతసమయం తర్వాత తేరుకుని సహోద్యోగి ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజుకు ఫోన్‌చేసి స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పమన్నానని తెలిపారు. పోలీసులు ఇంటికివస్తే ఇంట్లో శివుడు ఉన్నాడు.. షూలు, చెప్పులు వేసుకుని రావద్దంటూ పద్మజ గట్టిగా కేకలు వేసిందని చెప్పారు.  

ఆ రూ.5కోట్లే హత్యకు కారణమా? 
పద్మజ కుటుంబీకుల నుంచి రూ.5కోట్ల ఆస్తి వాటాగా వచ్చిందని, ఆ డబ్బును కాజేసేందుకు పథకం పన్ని ఇలాంటి ఘాతుకానికి ఒడికట్టి ఉంటారని మరికొందరు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై అసలు కారణాలు వెలుగులోకి రావాలంటే పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసి విచారణ నిగ్గు తేల్చాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.    

మరిన్ని వార్తలు