తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని కట్టేసి కొట్టారు! 

5 Jun, 2022 06:24 IST|Sakshi

అధిక వడ్డీలు ఇస్తానంటూ భారీగా అప్పులు చేసిన మహిళ 

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన 

కొమరాడ: అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపి గ్రామస్తుల నుంచి భారీగా అప్పులు చేసింది. ఆ సొమ్ముతో జల్సాలు చేసింది. చివరకు అప్పులు తీర్చలేనంటూ చేతులెత్తేయడంతో బాధితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రచ్చబండ వద్ద తాడుతో కట్టేసి కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సివిని గ్రామానికి చెందిన శోభ గత కొన్ని రోజులుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది.

అధికంగా వడ్డీలు ఇస్తానంటూ గ్రామస్తుల నుంచి సుమారుగా రూ.1.40 కోట్ల మేర అప్పుచేసింది. డబ్బు తిరిగివ్వాలంటూ వారంతా అడిగేసరికి చేతులెత్తేసింది. దీంతో ఏప్రిల్‌ 7న కొమరాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

శనివారం ఉదయం కొంత మంది బాధిత మహిళలు, గ్రామస్తులు కలిసి ఆమెను రామమందిరం వద్ద ఉన్న రచ్చబండ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆమెను విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ ప్రయోగమూర్తి చెప్పారు.   

మరిన్ని వార్తలు