పరువు పోయిందని.. ప్రాణం తీసుకుంది

16 Dec, 2020 04:00 IST|Sakshi

విధానాలు నచ్చక ప్రేమికుడిని దూరం పెట్టిన యువతి

మరో యువకుడితో నిశ్చితార్థం చేసిన కుటుంబసభ్యులు

తనతో చనువుగా ఉన్న ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి పంపిన మాజీ ప్రేమికుడు

ఆగిన పెళ్లి.. మనస్తాపానికి గురై పావని ఆత్మహత్య

సూర్యాపేట : ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ, అతని విధానాలు ఆమెకు నచ్చలేదు. దీంతో మరో యువకుడితో పెద్దలు కుదిర్చిన వివాహానికి ఒప్పుకుంది. నిశ్చితార్థం కూడా అయ్యింది. మాజీ ప్రేమికుడు.. తనతో ఆ అమ్మాయి చనువుగా ఉన్న ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, వారి కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో పెళ్లి ఆగింది. పెళ్లి ఆగడంతో పాటు కుటుంబం పరువు పోయిందని మనస్తాపానికి గురైన యువతి ప్రాణం తీసుకుంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన కునుకుంట్ల వెంకన్న పెద్ద కూతురు పావని (21) ఈ నెల 6న సూర్యాపేటలోని చింతలచెరువులోని బంధువుల ఇంటికి వెళ్లింది. 9న బయటకు వెళ్లివస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి సూర్యాపేట టూటౌన్‌కు బదిలీ చేశారు.

పెళ్లి ఆగిపోవడంతో..
పావని.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జీఎన్‌ఎంగా పనిచేస్తోంది. సొంత ఊరుకు చెందిన బొడ్డుపల్లి వంశీ, పావని కొంతకాలం ప్రేమించుకున్నారు. తర్వాత వంశీ విధానాలు నచ్చక.. అతన్ని దూరం పెట్టింది. ఇటీవల ఆమెకు జాజిరెడ్డిగూడెం మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుది రింది. నిశ్చితార్థం కూడా అయ్యింది. విషయం తెలిసిన వంశీ గతంలో తాను పావనితో దిగిన ఫొటోలను నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి, అతని బావకు పంపాడు. ఈ ఫొటోలను చూసి వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పావనిని తల్లిదండ్రులు ఇంటికి పిలిపించి మందలించారు. కొద్దిరోజులు సూర్యాపేటలో ఉండమని బంధువుల ఇంటికి పంపారు. దీంతో పరువుపోయిందని మనస్తాపానికి గురైన పావని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 


పత్తిచేనులో శవమై..
తిమ్మాపురం శివారులోని ఎస్సారెస్పీ కాలువ వద్ద పత్తిచేనులో యువతి మృతదేహం ఉందని సమచారం అం దుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పావనిదిగా గుర్తించి సూర్యాపేట టూటౌన్‌ పోలీ సులకు సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాని కి పోస్టుమార్టం జరిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పావని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. 

ముగ్గురిపై కేసు నమోదు..
పావని ఆత్మహత్యకు కారకుడైన బొడ్డుపల్లి వంశీతోపాటు పెళ్లి ఆగిపోవడానికి వంశీకి సహకరించిన నూకల శ్రీకాంత్, శ్యాంరెడ్డిలపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు