బైక్‌ లిఫ్ట్‌ అడగడమే ఆమెకు శాపమైంది.. వేధింపులు భరించలేక..

14 Sep, 2023 09:10 IST|Sakshi

సాక్షి, ఏలూరు: మహిళలు, యువతులపై వేధింపులు తగ్గించేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవు అనే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. 

ఈ దారుణ ఘటనపై ఎస్‌ఐ చావా సురేష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర లక్ష్మణరావుకు దెందులూరుకు చెందిన పావని (35)కి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల చదువుల నిమిత్తం గుండుగొలనులోని గంగానమ్మ గుడి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 15న పావని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ అటుగా వస్తున్న ఓ మోటార్‌ స్లైక్లిస్ట్‌ను లిఫ్ట్‌ అడిగి వెళుతోంది. 

అయితే, ఆ సమయంలో లక్ష్మీపురానికి చెందిన పాత నేరస్తుడు బోను శివకృష్ణ ఆమె బండి ఎక్కి వెళుతున్న దృశ్యాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి తన సహచరులైన బోను పవన్‌, సుంకర యశ్వంత్‌, శనపతి రాజబాబులతో కలిసి ద్వారకాతిరుమల వరకు వారిని వెంబడించారు. అక్కడ వారిని అడ్డగించి తమ కోరిక తీర్చాలని లేదంటే వీడియో వైరల్‌ చేసి అల్లరి పాలు చేస్తామని బెదిరించారు. అయినా ఆమె వారికి లొంగలేదు. 

కాగా, ఈనెల 10న బోను శివకృష్ణ సదరు మహిళ బైక్‌ ఎక్కి వెళ్లిన వీడియోను గ్రామంలో అందరికి షేర్‌ చేశాడు. వ్యభిచారిణిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వివాహిత అదేరోజు ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతదేహానికి వీఆర్వోలు వి.వెంకటేశ్వరరావు, కందులపాటి శంకర్‌ పంచనామా నిర్వహించారు. పావని మృతికి కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వీడియోలను తీసిన సెల్‌ఫోన్‌లను కూడా సీజ్‌ చేశామని చెప్పారు. నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. చేపల పట్టుబడికి వెళుతూ జీవనం పొందుతున్న భర్త, పిల్లలు పావని ఆత్మహత్యతో తల్లడిల్లిపోయారు.

ఇది కూడా  చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం

మరిన్ని వార్తలు