ఒకే కాలేజీ.. ఫేస్‌బుక్‌లో దగ్గరై సహజీవనం.. ఆ విషయం తెలిసి పవిత్ర నిలదీయగా..

19 Dec, 2021 16:48 IST|Sakshi
పవిత్ర (ఫైల్‌)   

 ప్రియుడిపై పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువకుడు ప్రేయసితో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైన ఆ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కొండా నారాయణ కూతురు పవిత్ర ఉపాధి కోసం నగరానికి వచ్చి కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది.

అయితే ఆమెతో పాటు ఒకే కాలేజీలో చదువుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పవిత్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గౌతమ్‌ ఆమెతో సంవత్సర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఇటీవల గౌతమ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న పవిత్ర అతడిని నిలదీసింది. దీంతో పెద్దల ఒత్తిడితోనే పెళ్లికి ఒప్పుకున్నానని అతడు పేర్కొన్నాడు.

చదవండి: (Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..)

పెద్దలను ఎదిరించి పవిత్రనే పెళ్లి చేసుకుంటానంటూ ఆమెతోనే సహజీవనం సాగిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గౌతమ్‌.. పవిత్ర తండ్రికి ఫోన్‌చేసి పవిత్ర ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుందంటూ సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికి తిరిగి ఫోన్‌చేసి పవిత్ర సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబీకులు హుటాహుటిన నగరానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవిత్ర ఆత్మహత్యకు గౌతమ్‌ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (Hyderabad: ముగ్గురు యువతుల అదృశ్యం.. షాకింగ్‌ ఏంటంటే..)

మరిన్ని వార్తలు