వీడు మామూలోడు కాదు .. బీటెక్‌ మానేసి.. వందలాది మందితో..

17 Oct, 2021 04:52 IST|Sakshi
ప్రసన్నకుమార్‌ (ఫైల్‌)

కడప అర్బన్‌: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇతగాడి పేరు చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ (23). ప్రశాంత్‌రెడ్డి, రాజారెడ్డి, టోనీ అనే పేర్లతోనూ చలామణి అయిన ఇతడు బీటెక్‌ ఫస్టియర్‌లో చదువు మానేశాడు. ఆ తర్వాత జల్సాల కోసం దొంగగా మారాడు. చైన్‌ స్నాచింగ్‌లు చేయడం.. ఇళ్లకు కన్నంవేసి సొత్తు కొట్టేయడం అతడి స్టైల్‌. చోరీలు చేసి దొరికిపోయిన అతగాడికి బోర్‌ కొట్టిందో ఏమో.. సోషల్‌ మీడియాలో రోమియో అవతారమెత్తాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలో రోమియో అవతారమెత్తి.. యువతులు, మహిళల్ని టార్గెట్‌ చేశాడు.

ఆ తర్వాత వారిని తెలివిగా ముగ్గులోకి దించి నగ్న వీడియోకాల్స్, అసభ్య చాటింగ్‌ చేయడం.. ఆనక వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది యువతులు, మహిళలపై వలపు వల విసిరి మోసగించడమే కాకుండా భారీగా సొమ్ములు కొల్లగొట్టాడు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీసులకు చిక్కి కటకటాల పాలైన ప్రసన్నకుమార్‌పై కడప ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు శనివారం పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

వీడు మామూలోడు కాదు 
ప్రసన్నకుమార్‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 26 కేసులున్నాయి. చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు బానిసైన ప్రసన్నకుమార్‌ 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతనిపై ప్రొద్దుటూరు త్రీటౌన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ నమోదైంది. ఆ తరువాత ప్రసన్నకుమార్‌ కడప, విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను టార్గెట్‌ చేసి వారితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పేవాడు. అసభ్యకర రీతిలో చాటింగ్‌ చేసేవాడు.

వారికి తెలియకుండా వారి ఫొటోలు, వీడియోలను రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి నుంచి తన గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు గుంజేవాడు. కొందర్ని శారీరకంగా లోబర్చుకునేవాడు. వందల సంఖ్యలో మహిళలను మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ ఫిర్యాదు చేసేందుకు రాలేదు. ఘరానా మోసగాడు ప్రసన్నకుమార్‌ చాపాడు, ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో చైన్‌స్నాచింగ్‌ కేసులో, 2019లో ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో, 2020లో విజయవాడు కమిషనరేట్‌ పరిధిలోని పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వివాహితను లైంగికంగా వేధించి, డబ్బుల కోసం బెదిరించిన కేసులో, 2020 నవంబర్‌లో శంషాబాద్‌ పరిధిలోని చౌదరిగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెనమలూరు తరహాలో నేరం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు.

వైఎస్సార్‌ జిల్లాలోని కడప, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల్లోని పలు ఇళ్లలో దొంగతనాలు చేసిన కేసులో ఇతను ప్రధాన∙నిందితుడు. కడప తాలూకా, వన్‌టౌన్, ప్రొద్దుటూరు టూటౌన్‌ స్టేషన్ల పరిధిలో 2021లో పలు మోటార్‌ సైకిల్‌ దొంగతనాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సోషల్‌ మీడియా వేదికగా మహిళల్ని మోసగిస్తున్న ప్రసన్నకుమార్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. 

మరిన్ని వార్తలు