లాయర్ల హత్య కేసు: మార్చిలోనే మారిన మంథని పరిణామాలు

10 May, 2021 10:44 IST|Sakshi

సూత్రధారులు, పాత్రధారులపై పోలీసులకు కొత్త ఆధారాలు 

కోర్టు వీడియో కాల్‌తో మొదటి కేసు, ఆ వెంటనే సుపారీ ఆడియో కేసు 

సాంకేతిక ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేస్తోన్న అధికారులు 

నెలరోజుల్లో మంథనిలో ఇద్దరు సీఐల బదిలీ 

రామగిరి, ముత్తారం, బసంత్‌నగర్, మంథని ఎస్సైలు కూడా.. 

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో అనుమానితుడిగా అరెస్టయిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌  పుట్ట మధు అదృశ్యం, అరెస్టు సంచలనంగా మారింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు బీజం మార్చిలోనే పడినట్లు అర్థమవుతుంది. పుట్ట, అతని అనుచరులకు సంబంధించి మార్చిలోనే బలమైన ఆధారాలు లభించాయి. సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయంలో ఇద్దరు కీలక పోలీసు ఉన్నతాధికారులకు ఈ ఆధారాలు చేరడంతో మంథనిలో పరి ణామాలు వేగంగా మారాయి. అనేక ఆకస్మిక మా ర్పులు చోటు చేసుకున్నాయి. మార్చి నుంచి పరిణామాలను పరిశీలిస్తే ఇవన్నీ అవగతమవుతాయి.  

ఏరోజు  ఏం జరిగిందంటే..?
► మార్చి 26: మంథని కోర్టులో బిట్టు శ్రీనుతో వీడియో కాల్‌ చేయించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌  పుట్ట శైలజపై కేసు నమోదు. 
► మార్చి 31: 2018లో కుంట శ్రీను ఓ హత్యకు రూ.60 లక్షల సుపారీ మాట్లాడిన ఆడియో టేపుపై ఫోరెన్సిక్‌ విచారణ కోసం పోలీసుల పిటిషన్‌ 
► ఏప్రిల్‌ 3: మంథని ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మహేందర్‌ బదిలీ. ఆయన స్థానంలో మహేందర్‌ రెడ్డి బాధ్యతల స్వీకరణ 
► ఏప్రిల్‌ 16: ఐజీ నాగిరెడ్డికి గట్టు వామనరావు తండ్రి కిషన్‌ రావు లేఖ. పుట్ట మధు, పుట్ట శైలజ, పూదరి సత్యనారాయణల పాత్రలపై లోతుగా దర్యాప్తు జరపాలని వినతి. 
► ఏప్రిల్‌ 29: మధు కీలక అనుచరుల్లో ఒకరి విచారణ 
► ఏప్రిల్‌ 30: విచారణకు రావాలని మధుకు నోటీసులు. అదేరోజు రాత్రి నుంచి మధు అదృశ్యం.  
► మే 1: మధు కోసం గాలింపు మొదలు. 
► మే 6: మంథని నియోజకవర్గంలో ఉన్న రామగిరి, ముత్తారం, బసంత్‌నగర్, మంథని ఎస్సైల బదిలీ. 
 మే 7: మంథని ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి బదిలీ 
► మే 8: మధు ఏపీలోని రాజమండ్రి సమీపంలో ఉన్నట్లు గుర్తింపు.  
► మే 9: భీమవరంలో పుట్ట మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, అదేరోజు సాయంత్రానికి రామగుండం కమిషనరేట్‌కు చేరుకున్నారు. 
► మే10: మధును విచారించిన పోలీసులు.

గుంజపడుగులో అక్రమ నిర్మాణాల ద్ద గ్రామపంచాయతీ అధికారులు  

సాంకేతిక ఆధారాలే కీలకం.. 
ఈ కేసులో మొదటి నుంచి పుట్ట మధు పేరు బలంగానే వినిపిస్తోంది. మార్చిలో దర్యాప్తు వేగం పుంజుకుంది. మే 17న చార్జిషీటు దాఖలు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్న సమయంలోనే పుట్ట మధును విచారణకు పిలవడం గమనార్హం. ఈ క్రమంలో పుట్ట మధు, అతని భార్య పుట్ట శైలజ, మార్కెట్‌ కమిటీ చైర్మ¯Œ  పూదరి సత్యనారాయణలు విచారణలో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పోలీసులు పలు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు.  

అవి ఏంటంటే..! 
► ఫిబ్రవరి 17న గట్టు వామన్‌ రావు హత్య జరిగిన తరువాత.. నిందితులు కుంట శ్రీను, బిట్టు శ్రీనులు మాట్లాడిన కాల్‌ డేటా రికార్డ్‌ (సీడీఆర్‌) కీలకం కానుంది. ఈ వివరాలు పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది.  

► వామన్‌రావు మరణవాంగ్మూలం వీడియోలు కూడా కీలకం కానున్నాయి. అందులో ఓ వీడియోలో పుట్ట మధు పేరునూ చెప్పినట్లు ఉంది. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక పోలీసుల చేతిలో ఉన్నట్లు సమాచారం.  

► కుంట శ్రీను రూ.60 లక్షలకు 2018లో సుపారీ ఎవరితో మాట్లాడాడు? అతడు దొరికితే ఎవరి హత్యకు సుపారీ మాట్లాడారు? అన్న విషయాలు వెలుగుచూస్తాయి. 

► గుంజపడుగులో శ్రీను అక్రమ ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ గతంలో అభ్యంతరం తెలిపింది. అయినా పనులు ఆగలేదు. దీని వెనక ఎవరున్నారో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. 

బిట్టు శ్రీను వాడిన కారు వివరాలు  

ఏడాదైనా నంబర్‌ప్లేటు ఏదీ? 
బిట్టు శ్రీను హత్యకు ఉపయోగించిన కారు విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మారుతీ బ్రిజా కారును 2020 ఫిబ్రవరిలో కొన్నారు. అదే నెల 24న టీఎస్‌22ఈ1288 నంబరుతో పర్మినెంటు రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ వాహనం బిట్టు శ్రీను భార్య తులసిగారి స్వరూప పేరు మీద ఉంది. ఏడాది కిందటేరిజిస్ట్రేషన్‌ చేసినా హత్య జరిగేరోజు వరకు టెంపరరీ రిజిస్ట్రేషన్‌ తోనే బిట్టు శ్రీను సంచరించాడు. అదే విధంగా కారుకు ఉన్న నల్ల అద్దాల షీట్‌ కూడా తీయలేదు. వాస్తవానికి వాహనం అద్దాలకు నల్లఫిల్మ్‌ ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ కారు కొనుగోలు వెనక ఎవరున్నారు? ఎవరు సమకూర్చారు? అన్న విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు