కుంట శ్రీనివాస్‌ ఆడియో క్లిప్‌.. గుడి కూలిపోతే

18 Feb, 2021 11:39 IST|Sakshi

కీలకంగా మారిన కుంట శ్రీనివాస్‌ ఆడియో క్లిప్‌

సాక్షి, పెద్దపల్లి: న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదమే హత్యకు గల ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్‌రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంటా శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్‌ డేటాను అనాలసిస్ చేయగా... ‘గుడి కూలితే వామన్‌రావు కూలిపోతాడు’ అని శ్రీనివాస్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ కీలకంగా మారింది. కాగా గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంటా శ్రీనివాస్‌పై గతంలో అనేక కబ్జా, బెదిరింపు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

                                               కుంటా శ్రీనివాస్‌

అదే విధంగా అతడు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస)లో పనిచేశాడని వెల్లడించారు. ఇక హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. కుంట శ్రీనివాస్‌ను త్వరిగతిన అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సీపీ సత్యనారాయణ సాయంత్రం మీడియా ముందుకు రానున్నారు. ఇక వామన్‌రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ–1గా కుంట శ్రీనివాస్‌, ఏ–2గా అక్కపాక కుమార్‌, ఏ–3గా వసంతరావును పేర్కొంటూ ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.

హైకోర్టులో పిటిషన్‌
పెద్దపల్లి ఘటనపై సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవంత్ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. వామన్రా‌వు దంపతుల హత్య కేసుపై సీబీఐచే  విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. కాగా కొబ్బరిబొండాలు కోసే కత్తులతో గట్టు వామన్‌రావు- వెంకట నాగమణిపై నిందితులు దాడి చేయగా వారు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ జంట హత్యలు చోటుచేసుకున్నాయి.

చదవండి: నడిరోడ్డుపై దారుణ హత్యలు.. వామన్‌రావు మరణ వాంగ్మూలం

మరిన్ని వార్తలు