నిధుల వేటలో.. మోసం లోతుల్లో!

31 May, 2022 11:59 IST|Sakshi

రైస్‌ పుల్లింగ్‌.. పూడు పాములు.. అక్షయపాత్ర.. సంజీవని వేరు.. బంగారు నాణేలు.. పేర్లు వేరైనా మోసం ఒక్కటే. ఊరికే డబ్బు వస్తుందంటే చాలు.. నమ్మడం అలవాటైన వాళ్లు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ల చేతిలో పెట్టి తీరా మోసపోయాక లబోదిబోమంటున్నారు. ఇక గుప్త నిధుల కోసమని అమావాస్య రాత్రిళ్లు.. పౌర్ణమి వెలుగుల్లో అడవిని జల్లెడ పడుతున్నారు. చారిత్రక ఆలయాలు, ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ కుండలు వెక్కిరిస్తున్నా అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. 


గతేడాది పలమనేరు మండలం దేవలంపెంట పురాతన శివాలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహంలో కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయంటూ దాన్ని హైదరాబాద్‌ ముఠా ధ్వంసం చేసింది. ఇది కేవలం మోసమేనని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. 

ఏడాది క్రితం మండలంలోని దొడ్డిపల్లి అడవిలో ఓ ముఠా గుప్తనిధుల తవ్వకాలకు వెళుతూ వేటగాళ్ల కరెంటు ఉచ్చుకు చిక్కి ఇద్దరు గాయపడ్డారు 

తాజాగా నియోజకవర్గంలో బేలుపల్లి సమీపంలోని శాతపురాళ్ల ఆలయం వద్ద ఓ ముఠా తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. 

.. ఇలాంటి ఘటనలు పోలీసుల దృష్టికి వెళితే కానీ విషయాలు వెలుగులోకి రాని పరిస్థితి. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో 
తరచుగా తవ్వకాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధుల వేట సాగుతోంది. రాత్రివేళల్లో కొన్ని అంతర్‌ రాష్ట్ర ముఠాలు స్థానికులను ఏజెంట్లుగా నియమించుకొని తమ పని కానిచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పురాతన, పాడుబడ్డ ఆలయాల్లో పూర్వీకులు బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే పురాతన ప్రాశస్త్యం ఉన్న పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి ఎన్నో  అడ్డదారులు ఉన్నాయి. 

ఎవరైనా, ఎప్పుడైనా సులభంగా వచ్చే వీలుంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలోనూ నకిలీ బంగారు నాణేలు, రైస్‌పుల్లింగ్, పూడుపాములు, అక్షయపాత్ర, సంజీవిని వేరు లాంటి రకరకాల మోసాలు, ఘటనలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. దుర్గం కొండపై ఉన్న ప్రాచీన ఆధారాలన్నింటినీ అక్రమార్కులు పెకళించారు. కృష్ణమ్మకొండపై సైతం దేవతా మూర్తులను పెకళించి నిధులకోసం అన్వేషించారు. కుప్పం ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాలు.. పుంగనూరు, సోమల, చౌడేపల్లె్ల, రామసముద్రంలో తవ్వకాలు షరామామూలుగా సాగుతున్నాయి. 

రాత్రి వేళల్లో గుట్టుగా.. 
∙పలమనేరు మండలంలోని చెల్లెమ్మ చెరువులో పురాతన కాలంనాటి ఓ పుష్కరిణి గతంలో బయటపడింది. దీంతో బంగారు నాణేలున్నాయని పలువురు గతంలో తవ్వకాలు చేపట్టారు.  

∙జగమర్ల అటవీప్రాంతంలో రంగురాళ్లు, వజ్రాల కోసం రాత్రి పూట కర్ణాటక వ్యక్తుల వేట కొనసాగుతోంది.  
∙బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం అడవిలో ఉండే పాండవ గుహల్లో ఇప్పటికే పలుమార్లు తవ్వకాలు చేశారు. అందులో ఏమీ దొరక్కపోయినా తవ్వకాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

∙ఇదే మండలంలోని అటవీప్రాంతంలో ధనబండ వద్ద ధనం ఉందని గతంలో తవ్వకాలు జరిగాయి. 
∙వీకోట మండలంలోని దుర్గంకొండ, కృష్ణమ్మ కొండ, క్రిష్ణాపురం, మోట్లపల్లె, గోనుమాకులపల్లె, కోటనక్కనపల్లె గ్రామాల్లోని పాత ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. 

∙మోట్లపల్లె వద్ద పంటపొలాల్లో బండల కింద గుప్త నిధులు ఉన్నాయని కర్ణాటకకు చెందిన ఓ ముఠా నాటు బాంబులతో ఆ బండలు పగులగొ ట్టింది. రాతి కింద బొగ్గులు ఉన్న కుండలు అక్కడ బయటపడడం గమనార్హం. 

అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో అధికం 
బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం సమీపంలో పాండవ గుహలున్నాయి. సుమారు పదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతంలో గతంలో పాండవులు నివసించారని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ ఓ ప్రత్యేకమైన చంద్రాకారంలో బండలతో నిర్మించిన గుడులున్నాయి. అయితే వీటి కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని పలు ముఠాలు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. ఈ ప్రాంతం అడవిలో ఉండడంతో స్థానికులు సైతం గుర్తించేందుకు వీలుకాని పరిస్థితి. ఈతంతు అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లోనే సాగుతోంది. కొన్ని ఆలయాల వద్ద బండలపై చెక్కిన లిపిని పరిశీలించి బంగారం ఉంటుందని కొందరు ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ముఠాల మాటలను నమ్మి ఈ ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాలకు చెందిన వారు సైతం లక్షలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని ఘటనలో మినహా చాలా వరకు పోలీసుల దృష్టికి కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది.

అమాయకంగా నమ్మకండి 
గుప్తనిధులు, రైస్‌పుల్లింగ్‌ లాంటి మో సాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. చాలా వరకు అరెస్టులు కూడా చేశాం. పత్రికల్లోనూ వెలుగులోకి వస్తున్నా అమాయకంగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ముఠాల కదలికలపై నిఘా ఉంచాం. ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే వారి ఆటకట్టిస్తాం. 
– గంగయ్య, డీఎస్పీ, పలమనేరు

మరిన్ని వార్తలు