ఆటోతో ఢీ కొట్టి..డంపింగ్‌ యార్డులో పడేసి.. 

10 Mar, 2021 08:22 IST|Sakshi
నిందితుడు సయ్యద్‌ షేర్‌ అలీ

రెండు నెలల తర్వాత బయటపడ్డ ఆటోడ్రైవర్‌ కిరాతకం 

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: మానవత్వం మనుషుల్లో రాన్రాను కానరాకపోతోందనడానికి, ఆటోడ్రైవర్‌ పేరుకు మచ్చతెచ్చే ఓ మచ్చుతునక ఈ అమానుష ఘటన. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి గాయపరచడమే కాకుండా అతడిని ఆస్పత్రిలో చేర్చాలన్న కనీస మానవత్వాన్ని మరిచి డంపింగ్‌ యార్డులో పడేసి ఆ వ్యక్తి మృతికి కారణమయ్యాడు ఓ ఆటోడ్రైవర్‌. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత సెల్‌ఫోన్‌ సిగ్నల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటోడ్రైవర్‌ కిరాతకం బయటపడింది. ఈ ఘటన వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు మంగళవారం విలేకరులకు వెల్లడించారు.  

ఫైనాన్స్‌ డబ్బులు చెల్లించేందుకు వెళ్లి... 
మియాపూర్‌ జనప్రియనగర్‌కు చెందిన కాకర రామకృష్ణ జనవరి 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి మియాపూర్‌ రత్నదీప్‌ మార్కెట్‌ వద్ద ఫైనాన్స్‌ డబ్బులు చెల్లించేందుకు గాను రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హఫీజ్‌పేటకు చెందిన సయ్యద్‌ షేర్‌ అలీ (38) తన స్నేహితుడైన గౌస్‌కు చెందిన ఆటో (టీఎస్‌07యూసీ 7684నంబర్‌)ను తీసుకుని ఆటోతో రామకృష్ణను ఢీ కొట్టాడు.

దీంతో తీవ్ర గాయాలైన రామకృష్ణ రోడ్డుపై పడి సృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి రామకృష్ణను ఢీ కొట్టిన ఆటోలోనే ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ షేర్‌ అలీకి సూచించారు. సరేనంటూ ఆటోలో బాధితుడిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్‌ షేర్‌ అలీ కొద్దిదూరం వెళ్లిన తరువాత బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఖైత్లాపూర్‌లోని డంపింగ్‌ యార్డులో పడవేసి వెళ్లిపోయాడు.  రామకృష్ణ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు రూ.3 వేల   నగదును కూడా తీసుకుని వెళ్లిపోయాడు. 

మిస్సింగ్‌ కేసుగా నమోదు 
అదే నెల 8వ తేదీకి కూడా రామకృష్ణ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబ సభ్యులు మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. మరోవైపు 8వ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటలకు ఖైత్లాపూర్‌ వద్ద ఉన్న జీహెచ్‌ఎంసీ డంపింగ్‌ యార్డు వద్ద గుర్తుతెలియని శవం పడి ఉందన్న సమాచారంతో కూకట్‌పల్లి పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మియాపూర్‌లో రామకృష్ణ మిస్సింగ్‌ కేసు నమోదు కావడం, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం కావడంతో పాటు ఇద్దరి వివరాలు ఒకే విధంగా ఉండటంతో రామకృష్ణ కుటుంబసభ్యులను కూకట్‌పల్లి పోలీసులు పిలిపించగా..వారు మృతదేహాన్ని రామకృష్ణదిగా గుర్తించారు.

మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఆ క్రమంలో ముందుగా రామకృష్ణ రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడాన్ని సీసీ పుటేజీద్వారా గుర్తించారు. దీంతోపాటుగా రామకృష్ణ సెల్‌ఫోన్‌ను నిందితుడైన ఆటోడ్రైవర్‌ లతీఫ్‌ అనే వ్యక్తికి రూ.1000కి విక్రయించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో లతీఫ్‌ను విచారించగా నిందితుడు ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ షేర్‌ అలీ అని తేలింది. మంగళవారం ఆటో డ్రైవర్‌ సయ్యద్‌ షేర్‌అలీని అదుపులోకి తీసుకుని విచారించగా..సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రతికేవాడేనని, ఆస్పత్రికి తీసుకెళ్లితే తనపై కేసు అవుతుందేమోనన్న భయంతో పాటు వైద్యం ఖర్చులు కూడా తానే భరించాల్సి వస్తుందన్న కారణంతో రామకృష్ణను డంపింగ్‌ యార్డులో పడేసినట్లు షేర్‌ అలీ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు