ప్రాణం తీసిన అగ్గిపుల్ల, చూస్తుండగానే ఘోరం

4 Apr, 2021 08:07 IST|Sakshi

బీడీ వెలిగించుకుని పడేసిన అగ్గిపుల్ల 

పెట్రోలు డబ్బాలపై పడి చెలరేగిన మంటలు 

నిజాంసాగర్‌(జుక్కల్‌): బీడీ కాల్చేందుకు వెలిగించిన అగ్గిపుల్ల ప్రాణాలనే తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల కేంద్రానికి చెందిన తాటివార్‌ బాలరాజ్‌ (35) శనివారం మధ్యాహ్నం తన చెల్లెలు సోని కిరాణా దుకాణానికి వెళ్లాడు. దుకాణంలో ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో బాలరాజ్‌ పెట్రోల్‌ డబ్బాల పక్కన కింద కూర్చున్నాడు. అనంతరం అగ్గిపుల్ల వెలిగించి బీడీ అంటించుకున్నాడు. ఆ తర్వాత అగ్గిపుల్లను పారవేసే క్రమంలో అది పెట్రోల్‌ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బాలరాజ్‌కు అంటుకున్నాయి.

మంటల్లో చిక్కుకున్న బాలరాజ్‌ హాహాకారాలు చేస్తూ కింద పడిపోయాడు. చుట్టుపక్కల వారు, అటు వైపు వచ్చిన వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అందరూ చూస్తుండగానే బాలరాజ్‌ సజీవదహనం అయ్యాడు. ప్రమాద సమయంలో కిరాణా దుకాణంలో ఉన్న పిల్లలు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌.ఐ దత్తాత్రిగౌడ్‌ తెలిపారు.  
చదవండి: యువతి కిడ్నాప్; ఆపై అత్యాచారం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు