ఖద్దర్‌ చొక్కా.. లుంగీ.. శబ్దం రాకుండా దొంగతనాలు

22 Aug, 2021 10:27 IST|Sakshi

నగరంపాలెం: షోరూం షట్టర్లను పగులకొట్టి చోరీలకు పాల్పడే అంతర్‌ జిల్లా ఘరానా దొంగను అరెస్ట్‌ చేసినట్లు అర్బన్‌ ఏఎస్పీ డి. గంగాధర్‌ తెలిపారు. అతడి నుంచి రూ. 4 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పా రు.  శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ ఫిబ్రవరి 8న పెదకాకాని పీఎస్‌ పరిధిలోని ఆటోనగర్‌లో ఉన్న రాయల్‌ యన్‌ఫీల్డ్‌ షోరూం షట్టర్‌ పగులకొట్టి రూ.2.40 లక్షలు చోరీ చేశారు. దీనిపై పెదకాకాని పీఎస్‌లో కేసు నమోదవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి శనివారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామానికి చెందిన గుబిలి సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలు వెల్లడయ్యాయి.  

చదవండి: 13 అడుగుల కింగ్‌ కోబ్రా

ఖద్దరు చొక్కాతో తిరిగి..
పాత నేరస్తుడైన గుబిలి సుబ్రమణ్యం గతంలో వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. చెడు వ్యస నాలకు బానిసయ్యాడు. పెద్దగా చదువుకోలేదు. దొంగతనాలు చేసే ముందు ఒకట్రెండు రోజులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించే వాడు. ఏ ఒక్కరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఖద్దర్‌ చొక్కా, లుంగీ ధరించి సంచరించే వాడు.  ఎక్కువగా పెదకాకాని పరిధిలోని ఆటోనగర్‌ను చోరీలకు ప్రధానంగా ఎంచుకున్నాడు. ఆయా ప్రాంతాల్లోని లారీల్లో దొరికే ఇనుప వస్తువులతో షట్టర్‌ పగులకొట్టే వాడు. ఎటువంటి శబ్దం రాకుండా పగులకొట్టడంలో సిద్ధహస్తుడు. లోనికి వెళ్లాక ముందు సీసీ కెమెరాలను గుర్తించి వాటి కనెక్షన్లు తొలగించే వాడు. అనంతరం కెమెరాలను, డీవీఆర్‌లు, వైఫే కనెక్షన్లను ఏ ఒక్కరూ ఉపయోగించరాదనే ఉద్దేశంతో వాటిని తస్కరించి పోలీసులకు అనుమానం రాకుండా చివరకు నదుల్లో విసిరివేసేవాడు.  

పొరుగు జిల్లాల్లోనూ చేతివాటం! 
కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు షోరూంల్లో షట్టర్‌ పగులకొట్టి 23 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. పెదకాకాని పీఎస్‌ పరిధిలో 5, మంగళగిరి టౌన్‌ పీస్‌ పరిధిలో 3, ఒంగోలు రూరల్‌ పీఎస్‌ పరిధిలో 5, సింగరాయకొండ, మేదరమెట్ల, నల్లపాడు పీఎస్‌ పరిధిలో ఒక్కొక్కటీ చొప్పున కేసులు నమోదయ్యాయి. గతంలో గుడివాడ టూ టౌన్‌ పీఎస్, పెడన పీఎస్, పశ్చిమ గోదావరి, ఉయ్యూరు పీఎస్‌ పరిధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పెదకాకాని పీఎస్‌ సీఐ బి.సురేశ్‌బాబు, ఇతర సిబ్బంది ఏఎస్పీ  అభినందించారు.  

చదవండి: ప్రేమ పేరుతో వంచించి.. నగ్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి.. 

మరిన్ని వార్తలు