నేను చచ్చే దాకా ఆమె నన్ను వదలదు..

28 Mar, 2021 04:26 IST|Sakshi

పీహెచ్‌సీ వైద్యాధికారిపై వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి ఫార్మసిస్ట్‌ ఆత్మహత్యాయత్నం 

సాక్షి, పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): ‘నేను చచ్చే దాకా ఆమె నన్ను వదలదు.. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు’.. అంటూ వైద్యాధికారినుద్దేశించి వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టిమరీ పీహెచ్‌సీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని పీహెచ్‌సీలో ఫార్మాసిస్ట్‌గా సంధ్య కొంత కాలంగా పనిచేస్తూ అదే గ్రామంలోని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే పీహెచ్‌సీ సిబ్బంది తీరుతో ఆమె ఇబ్బందిపడుతున్నారు. ఓపీ స్లిప్పులు రాయాల్సిందిగా ఫార్మాసిస్టును శుక్రవారం స్టాఫ్‌ నర్సులు కోరారు. అందుకు సంధ్య నిరాకరిస్తూ అది తన డ్యూటీ కాదని చెప్పారు. దీంతో వైద్యాధికారి డాక్టర్‌ రత్నశ్రీ ఫార్మాసిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా శనివారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్న చిత్రాన్ని సెల్ఫీ తీసుకుని.. ‘డాక్టర్‌ రత్నశ్రీ నన్ను అవమానించింది.. అవమానిస్తూనే ఉంటుంది. నేను చచ్చే దాకా వదలదు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఏమీ చేయలేని దానిగా బతకటం కంటే.. చస్తే ఈ బాధలేవీ నాకుండవ్‌.. సో ఐయామ్‌ గెట్టింగ్‌ సూసైడ్‌’ అంటూ స్టేటస్‌ అప్‌డేట్‌ చేసింది. ఉదయాన్నే స్టేటస్‌ను గమనించిన సిబ్బంది, సహచరులు గ్రామ వలంటీర్లకు సమాచారం ఇచ్చారు. వారు సంధ్య ఇంటికి వెళ్లి చూడగా ఆమె అపస్మారక స్థితిలో ఉండి.. తనకు నీరసంగా ఉందని చెప్పి వారిని వెనక్కి పంపినట్టు సమాచారం. ఈ విషయం డీఎంహెచ్‌వో యాస్మిన్‌ దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రాథమిక విచారణకు ఆదేశించారు. డిస్ట్రిక్ట్‌ టీబీ కంట్రోల్‌ ఆఫీసర్‌ రమేష్‌ ఆస్పత్రిలో ప్రాథమిక విచారణ చేపట్టారు. వైద్యాధికారి రత్నశ్రీతో పాటు స్టాఫ్‌ నర్సులను విచారించారు. విచారణ నివేదికను డీఎంహెచ్‌వోకు అందజేస్తానని రమేష్‌ వివరించారు. కాగా, తాను ఎవ్వరినీ వేధించలేదని డాక్టర్‌ రత్నశ్రీ చెప్పారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు