ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాతుండగా పేలిన ఫోన్‌.. తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి..

2 Mar, 2023 19:21 IST|Sakshi

భోపాల్‌: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్స్ మాట్లాడొద్దని నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష‍్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బాద్‌నగర్ తహసీల్దార్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. దయారామ్ బరోద్ అనే 68 ఏళ్ల వ్యక్తి ఫోన్ బ్యాటరీ డౌన్ కావడంతో  ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే కాల్ వచ్చింది. ఛార్జింగ్‌ ప్లగ్ తీయకుండా అలాగే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. దీంతో ఫోన్ పేలిపోయింది. పేలుడు ధాటికి దయారామ్‌కు తల, మొహం, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

పేలుడు సమయంలో దయారామ్ అతని స్నేహితుడు దినేశ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యే విషయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో దయానంద్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. కాల్‌ సడన్‌గా కట్ కావడంతో దినేశ్ దయారామ్‌కు మళ్లీ ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో ఏం జరిగి ఉంటుందా అని దగ్గర్లోనే ఉన్న దయారామ్ ఇంటికి వెళ్లిన అతడు షాక్ అయ్యాడు. తీవ్ర గాయాలపాలై దయానంద్ అప్పటికే చనిపోయి ఉన్నాడు.  ఇతని భార్య మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్నట్లు దినేశ్ చెప్పాడు.

ఫోన్ కాల్‌ మాట్లాడినప్పుడు ఛార్జర్ స్విచ్ బోర్డుకు కనెక్ట్ అయ్యే ఉన్నట్లు  ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అయితే అతను ఏ కంపెనీ ఫోన్ ఉపయోగించాడనే విషయంపై మాత్రం స్పష్టత ఇ‍వ్వలేదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినప్పుడు ఓవర్‌హీట్ వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ రెడ్‌ మార్క్‌లో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా డేంజర్ అని సూచించారు.
చదవండి: హత్రాస్ ‍సామూహిక అత్యాచారం కేసు.. ముగ్గురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన యూపీ కోర్టు

మరిన్ని వార్తలు