IPS Officer Rashmi Shukla: రష్మి శుక్లాకు ముంబై పోలీసుల నోటీసులు

29 Apr, 2021 07:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఉన్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సౌత్‌జోన్‌ కార్యాలయంలో స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి రష్మి శుక్లాకు ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఈమె మహారాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అప్పట్లో ముంబైకి చెందిన రాజకీయ నాయకులు సహా అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేసిన వ్యవహారానికి సంబంధించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

దీని దర్యాప్తులో భాగంగా రష్మి నుంచి వాంగ్మూలం నమోదు చేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బుధవారం ముంబై రావాలంటూ సోమవారం నోటీసులు జారీ చేశారు. అయితే కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తాను హాజరుకాలేనని, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రతితో పాటు అడగాలని భావించిన ప్రశ్నావళిని పంపాల్సిందిగా శుక్లా సమాధానమిచ్చినట్లు తెలిసింది. గత ఏడాది మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్‌లతో వివిధ హోదాలకు చెందిన పోలీసుల బదిలీలు జరిగాయి.

కొందరి పోస్టింగ్స్‌ కోసం భారీ మొత్తం చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ముంబైకి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రష్మి శుక్లా్ల ముంబైకి చెందిన కొందరు రాజకీయ నాయకులు సహా ప్రముఖుల ఫోన్లు అక్రమంగా ట్యాప్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర సర్కారు దర్యాప్తు చేయించాలని నిర్ణయించింది.

ఈ మేరకు శుక్లా నుంచి వాంగ్మూలం నమోదు చేయాలని సైబర్‌ క్రైమ్‌ అధికారులు నిర్ణయించారు. ఆమెకు ముంబైలోనూ ఓ నివాసం ఉంది. వాంగ్మూలం నమోదు కోసం బుధవారం ఆ ఇంటికి రావాలని, ఉదయం 11 గంటలకు తాము వచ్చి వాంగ్మూలం నమోదు చేస్తామని నోటీసులు జారీ చేశారు. అయితే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తాను అక్కడకు రావడం సాధ్యం కాదంటూ రష్మి శుక్లా జవాబు ఇచ్చారు.

చదవండి: కస్టడీ వ్యక్తి మృతి: ముగ్గురు పోలీసులకు పదేళ్ల జైలు

మరిన్ని వార్తలు