దారుణం: ట్రై సైకిల్ పైనే భువనేశ్వరి సజీవ దహనం

19 Dec, 2020 09:10 IST|Sakshi
భువనేశ్వరి (ఫైల్‌) 

కాల్‌ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు

సాక్షి, ఒంగోలు: మహిళా వలంటీర్‌.. పైగా రెండు కాళ్లూ లేని దివ్యాంగురాలు.. నగరానికి రెండు కిలోమీటర్ల ఆవల నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైంది. ఈ సంఘటన దశరాజుపల్లికి వెళ్లే దారిలో అప్పాయకుంట వద్ద శుక్రవారం రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. నిత్యం ఆమె ఏ త్రిచక్ర వాహనం ఉపయోగిస్తుందో ఆ వాహనంలోనే కాలిపోయింది. ఎవరో తగలబడుతున్నారన్న సమాచారం పోలీసులకు రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలార్పారు. ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌ కనిపించింది. అందులో యువతి ఆధార్‌కార్డు, ఐడీ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె గోపాలనగరం వాసి ఉమ్మనేని భువనేశ్వరి (23)గా గుర్తించారు.

ఈమె తల్లి జానకి స్థానికంగా ప్రకాశం భవనం ఎదుట రాఘవ బుక్‌షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటోంది. భువనేశ్వరికి మరో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి ఉంది. తండ్రి వీరు చిన్నప్పుడే కన్నుమూశాడు. తన బిడ్డను ఎవరో హత్య చేసుంటారంటూ జానకి సంఘటన స్థలానికి వచ్చి భోరున విలపించింది. వలంటీర్‌ అంతదూరం ఎందుకు వెళ్లింది, ఆమె చివరగా ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడింది.. తదితరాల వివరాల కోసం పోలీసులు కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. భువనేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా హత్య చేశారా.. అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. 

చదవండి: (చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..)

మరిన్ని వార్తలు