పోక్సో కేసులో దోషికి యావజ్జీవ ఖైదు, జరిమానా

29 Jun, 2022 04:47 IST|Sakshi

ఒంగోలులోని పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి తీర్పు

ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2018లో బాలిక (13)పై లైంగికదాడి చేసిన నేరానికి ఆరెం చెన్నయ్య (40)కు యావజ్జీవ ఖైదు విధిస్తూ ఒంగోలులోని పోక్సోకోర్టు ప్రత్యేక జడ్జి సోమశేఖర్‌ మంగళవారం తీర్పు చెప్పారు. తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లిన సమయంలో ఇంటివద్దనున్న ఆ బాలికను  చెన్నయ్య బలవంతంగా సమీపంలోని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఇంటి యజమాని రావడం, బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు.

బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నయ్యపై పోక్సో చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో  చెన్నయ్యకు జీవితకాలం జైలుశిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలు మైనర్‌ కావడంతో ఆమెకు వైద్యఖర్చులు, పునరావాసం కోసం రూ.5 లక్షలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సూచించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పోక్సో కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.వి.రామేశ్వరరెడ్డి వాదించారు. 

మరిన్ని వార్తలు