సెల్‌ఫోన్‌ వాడడు.. సీసీ కెమెరాకు చిక్కడు.. శ్మశానంలోనే తిండి, నిద్ర.. 

16 Sep, 2022 19:29 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం: అతని వయసు వయస్సు 28.. చేసిన దొంగతనాలు 127.. నమోదైన కేసులు 54.. ఎక్కకెళ్లినా ఒక్కడే వెళ్తాడు.. కనీసం సెల్‌ఫోన్‌ కూడా వాడడు.. పోలీసులకు ఏ ఒక్క క్లూ వదలడు.. సీసీ కెమెరాకూ దొరకడు.. చదువుకున్న వ్యక్తీ కాదు.. కానీ చాలా స్మార్ట్‌. శ్మశానాన్నే అడ్డాగా చేసుకుని తన పంథా కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి.. ఆకతాయిగా కోడిపుంజును దొంగిలిండంతో తొలిసారి జైలు కెళ్లాడు.. ఆపై దొంగతనాన్నే వృత్తిగా మార్చుకుని.. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వరుస చోరీలు చేస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి.. ఎట్టకేలకు చల్లపల్లి పోలీసులకు పట్టుపడ్డాడు. దీంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి: భార్యకు దూరంగా భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. లాడ్జిలో షాకింగ్‌ ఘటన..  

ఇదీ నేపథ్యం.. 
ఈ దొంగ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూర్‌ గ్రామానికి చెందిన వాడు. పేరు తిరువీధుల సురేంద్ర అలియాస్‌ సూర్య. వయస్సు 28. తన పదో ఏటే తండ్రి మరణించాడు. రెండేళ్ల తర్వాత అదే గ్రామంలో పందెం కోళ్లను ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది. తల్లిదండ్రులు లేక అనాథగా మారిన సూర్యని ఎ. కొండూరు మండలం మాధవవరంలో ఉన్న తన అమ్మమ్మ చేరదీసింది. చదువు మీద దృష్టి పెట్టని సూర్య దొంగతనమే మేలని భావించి.. ఆ దిశగానే అడుగులు వేశాడు.

చోరీలు ఇలా.. 
మొదట కోళ్లను దొంగలించి జైలు పాలైన సూర్య.. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషించుకున్నాడు. అందులో భాగంగా చేతికి గ్లౌజ్‌లు ధరించడం మొదలు పెట్టాడు. ఇక సీసీ కెమెరాలకు దొరక్కుండా దొంగతనం ఎలా చేయాలనే దానిపై కూడా తనకుతానుగానే ఆలోచించుకుని.. ఎవరూ లేని నివాసాలే లక్ష్యంగా చోరీలు చేస్తుండేవాడు. అందుకోసం ముందుగా ఓ బైక్‌ను తస్కరించడం.. దానిపై వారం పాటు వీధుల్లో తిరిగి.. డబ్బులు, నగలు ఉన్న వారి నివాసాలను గుర్తించడం చేసేవాడు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవా? పరిశీలించేవాడు.

ఆ తర్వాత కుటుంబీకులు తాళం వేసి ఎప్పుడు బయటకు వెళ్తారా? అని ఎదురుచూసేవాడు. కుటుంబీకులు బయటకు వెళ్లాక చేతికి గ్లౌజ్‌లు ధరించి నివాసాల్లోకి చొరబడేవాడు. ఒకవేళ అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ముందే పనిచెయ్యకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. అనంతరం నివాసంలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, నగదును దొంగలించి సురక్షితంగా వెలుపలకు వచ్చేసేవాడు. ఇలా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ దొంగతనాలపై 47 కేసులు నమోదయ్యాయి. గతనెల 17న ఖమ్మం జైలు నుంచి బయటకు వచ్చిన సూర్య, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజానగరం, కృష్ణా జిల్లా గుడివాడ, చల్లపల్లి దొంగతనాలు చేశాడు. దీంతో ఇతనిపై మొత్తం 54 కేసులు నమోదయ్యాయి.

శ్మశానమే నివాసంగా.. 
దొంగతనం చేసిన ఆభరణాలు, నగదుతో ఎక్కడో ఓ చోట గదిలో ఉంటే పోలీసులకు దొరికిపోతానేమోనని సూర్య శ్మశానాన్ని ఎంచుకున్నాడు. ఎవరికీఅనుమానం రాని శ్మశానంలో వాటిని గొయ్యితీసి దాచిపెడతాడు. చిన్నతనం నుంచే రాటుదేలిన సూర్య ఎటువంటి భయాలు, పట్టింపులు లేకుండా అక్కడే నిద్రిస్తాడు. అంతకు ముందు మద్యం, భోజనం తెచ్చుకుని ఫుల్‌గా లాగించి పడుకుంటాడు. ఉదయం లేచి యథావిధిగా వీధుల్లో తిరగటం, సినిమాలకు వెళ్లటం చేస్తుంటాడు.

బంధువులు ఉన్నా.. 
సూర్యకు బంధువులు ఉన్నా.. వారితో ఎటువంటి సత్సంబంధాలు నెరిపేవాడు కాడు. ఎప్పుడైనా అమ్మమ్మ వద్దకు వెళ్లి ఆమె ఖర్చులకు డబ్బులు ఇచ్చి వచ్చేసేవాడు. చివరగా కృష్ణా జిల్లా చల్లపల్లి సమీపంలోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు చాకచక్యంగా సూర్యను పట్టుకుని అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 17లక్షలు విలువ చేసే బంగారు, రూ. 2లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకుని అతని దొంగతనాలకు చెక్‌పెట్టారు.   

మరిన్ని వార్తలు