ఏటీఎంలో చోరీ.. గంటలోనే దొంగ పట్టివేత!

7 Jun, 2021 12:58 IST|Sakshi

చందానగర్‌: ఏటీఎంలో డబ్బులు కాజేసి పారిపోయిన దొంగను చందానగర్‌ పోలీసులు ఒక్క గంటలోనే పట్టుకొని.. రూ.6 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ క్యాస్ట్రో కథనం ప్రకారం... శేరిలింగంపల్లి నల్లగండ్ల అపర్ణ జెనిత్‌ ఎదురుగా ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో శనివారం రాత్రి ఒంటి గంట సమయంలో ఏటీఎం బాక్స్‌ను బద్దలకొట్టి అందులోని నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు చందానగర్‌ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.  

చుట్టు పక్కల గాలించగా నల్లగండ్ల హూడా లేఅవుట్‌ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు అతడిని అదుపులో తీసుకొని సోదా చేయగా, రూ. 6.50 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ దొరికింది. పోలీసులు తమ దైన శైలిలో విచారించగా ఏటీఎంలో దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. నిందితుడి పేరు రాజు అని, ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ నల్లగండ్లలో నివాసముంటున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఏటీఎంలో చోరీకి ఉపయోగించిన పరికరాలు, రూ. 6.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: నారాయణఖేడ్‌లో బొలేరో వాహనం బీభత్సం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు