యూట్యూబ్‌ చూసి దొంగలయ్యారు!

12 Sep, 2021 07:45 IST|Sakshi

సాక్షి,చిత్తూరు అర్బన్‌: టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. మంచీ.. చెడు అనేది తెలియదు. మనం ఏది అడిగితే అది చూపెడుతుంది. చిత్తూరుకు చెందిన ఇద్దరు యువకుల్లో ఒకరు తాళం వేసిన బైక్‌లను ఎలా చోరీ చేయాలో యూ ట్యూబ్‌ చూసి నేర్చుకుంటే.. మరొకరు దొంగతనం చేసిన బైకులను అమ్మడం చేసేవాడు. వీరిద్దరినీ చిత్తూరు సీసీఎస్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో   సీసీఎస్‌ సీఐ రమేష్‌ వివరాలను వెల్లడించారు. బంగారుపాళ్యంకు చెందిన తోట రాజేష్‌ (23) కూలీ పనిచేస్తూ తిరుపతిలో జీవిస్తున్నాడు. జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు బానిసైన ఇతను బైక్‌లను ఎలా చోరీ చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప, చంద్రగిరి, రేణిగుంట తదితర ప్రాంతాల్లో బైకులు చోరీ చేశాడు.

యాదమరికి చెందిన జి.ఈశ్వర్‌ (20) చిత్తూరులోని వీసీఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతూ స్నేహితుడైన రాజేష్‌తో కలిసి బైకులు చోరీచేయడం, వాటిని అమ్మి.. వచ్చిన నగదుతో జల్సా చేసేవారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. లభించిన ఆధారాలతో నిందితులిద్దరినీ అరెస్టుచేసి రూ.36 లక్షలు విలువైన మోటారు సైకిళ్లు స్వాదీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి పోలీసులు సీజ్‌ చేసిన బైకుల్లో కేటీఎం, బుల్లెట్, యమహా కంపెనీలకు చెందిన ఖరీదైన వాహనాలున్నాయి. సమావేశంలో సీసీఎస్‌ సీఐ–2 లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు రవికుమార్‌రెడ్డి, విజయ భాస్కర్‌రాజు, సిబ్బంది బాబు, లోకనాధం, కనికాచలం తదితరులు పాల్గొన్నారు.

చదవండి: కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాష్టీకం

మరిన్ని వార్తలు