కారుకు నిప్పు: వేణుగోపాల్‌రెడ్డి అరెస్టు

18 Aug, 2020 18:37 IST|Sakshi

24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

సాక్షి, విజయవాడ: బెజవాడలో కారు దుర్ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే ఛేదించారు. వ్యాపార లావాదేవీల్లో వివాదమే హత్యాయత్నానికి దారి తీసినట్లు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు వేణుగోపాల్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ హర్షవర్ధన్‌రాజు మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నమ్మించి మోసం చేసినందుకే ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్లు వేణుగోపాల్‌రెడ్డి విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు.

‘‘ఆర్థిక లావాదేవీల విషయంలో వేణుగోపాల్‌రెడ్డికి క్రిష్ణారెడ్డి, గంగాధర్‌లతో విభేదాలు వచ్చాయి. గంగాధర్‌ రియల్‌ ఎస్టేట్‌ విషయంలో మోసం చేయడమే గాకుండా క్రిష్ణారెడ్డికి డబ్బులు కూడా ఇప్పించాడు. తాను ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అందుకే తనను మోసం చేసి, అప్పుల పాలు చేసిన క్రిష్ణారెడ్డిపై వేణుగోపాల్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. అందుకే వారిని చంపేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగానే సోమవారం కారులో ఉన్న వాళ్లను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు’’అని తెలిపారు.(కారుపై పెట్రోలు పోసి.. ముగ్గురిపై హత్యాయత్నం)

కాగా సోమవారం సాయంత్రం విజయవాడ నోవాటెల్‌ సమీపంలోని భారతీనగర్‌లో కారుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. తాడేపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి.. విజయవాడ వెటర్నరీ కాలనీకి చెందిన గంగాధర్, అతడి భార్య నాగవల్లి, గాయత్రీనగర్‌కు చెందిన కృష్ణారెడ్డిలను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఆర్థిక విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కారులో కూర్చొని చర్చలు జరుపుతూనే హఠాత్తుగా బయటకొచ్చిన వేణుగోపాల్‌రెడ్డి, తనతోపాటు తెచ్చుకున్నపెట్రోలును కారుపై పోసి నిప్పంటించి పారిపోగా.. 24 గంటల్లోపే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక ఈ ఘటనలో కృష్ణారెడ్డికి తీవ్రంగా.. గంగాధర్, నాగవల్లిలకు స్వల్పంగా గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు