మాయగాడు; చదువు బీటెక్‌.. చోరీల హైటెక్‌

10 Apr, 2021 07:58 IST|Sakshi
 కేసు వివరాలను వెల్లడిస్తున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌, ఇన్‌సెట్లో అంతరాష్ట్ర దొంగ మహేష్‌ నూతన్‌ కుమార్‌   

షేరింగ్‌ రూముల్లో ఐడీ కార్డుల చోరీలు

వాటితో కార్లు అద్దెకు తీసుకొని పరార్‌

ఆరు కార్లు, ఒక బైక్‌ స్వాధీనం

కేసు వివరాలు వెల్లడించిన సైబరా  బాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌

సాక్షి, గచ్చిబౌలి:  బీటెక్‌ చదివిన పరిజ్ఞానం భవిష్యత్‌కు ఉపయోగించలేదు.. నకిలీ ఐడీ కార్డుల తయారీకి ఉపయోగించి చోరీల బాట పట్టాడు ఓ యువకుడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడు రాష్ట్రాల్లో చోరీలు చేయడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడి అదేపనిగా చోరీలు చేయడం అతడి నైజంగా మారింది. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. అద్దెకార్లు, బైక్‌లను చోరీ చేసిన అంతరాష్ట్ర దొంగను శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో శుక్రవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

సీసలీ గ్రామం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గుడాటీ మహేష్‌ నూతన్‌ కుమార్‌(27) బీటెక్‌(ఈఈఈ) 2016లో పూర్తి చేశాడు. భీమవరం టౌన్‌లో మొబైల్‌ టెక్నీషన్‌గా కొద్ది రోజులు పనిచేసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేట్‌లో మొబైల్‌ టెక్నీషన్‌గా పనిచేస్తూ నకిలీ తాళం చెవిలతో షాపులు తెరిచి చోరీలకు పాల్పడ్డాడు. మలక్‌పేట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన అనంతరం మళ్లీ భీమవరం వెళ్లాడు. కెమెరా చోరీ చేయడంతో పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. బోల్ట్‌ టాటా కారు, ల్యాప్‌టాప్, రూ.25 వేల నగదు చోరీ చేయడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేసి 2019 డిసెంబర్‌లో జైలుకు పంపారు.

షేరింగ్‌ రూమ్‌లో చేరి..
జైలు నుంచి బయటకు వచ్చి పంజాగుట్టలో షేరింగ్‌ యాప్‌ ద్వారా గది అద్దెకు తీసుకున్నాడు. రూమ్‌మేట్‌ నాగేంద్ర ప్రసాద్‌తో స్నేహంగా మెలిగి రూ.1.60 లక్షల నగదు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఐడీ కార్డులు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. అక్కడి నుంచి జూలైలో బెంగళూర్‌కు వెళ్లి షేరింగ్‌ రాయల్‌ బ్రదర్స్‌లో నాగేంద్ర ఆధార్‌ కార్డును ఎడిట్‌ చేసి తన ఫొటో పెట్టి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అద్దెకు తీసుకున్నాడు. బైక్‌ జీపీఎస్‌ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్‌ ప్లేట్‌లో బుల్లెట్‌పై నేరుగా వైజాగ్‌ వెళ్లాడు. అక్కడ షేరింగ్‌ రూమ్‌లో అద్దెకు దిగి రెండు నెలలు ఉన్నాడు. రూమ్‌ మేట్‌ చైతన్యకు చెందిన రూ.30 వేల నగదు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తస్కరించి  బుల్లెట్‌పై పూణె వెళ్లాడు. షేరింగ్‌ రూమ్‌లో చేరి సతీష్‌ అనే వ్యక్తికి చెందిన రూ.1.80 లక్షలు నగదు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చోరీ చేసి హైదరాబాద్‌కు వచ్చి చెంగిచెర్లలో నివాసం ఉన్నాడు. 

చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..!

2020 అక్టోబర్‌లో కేరళ వెళ్లి కొచ్చిలో సతీష్‌ ఐడీ కార్డులు ఎడిట్‌ చేసి జూమ్‌ కార్స్‌లో వోక్స్‌వ్యాగన్‌ పోలో కారును అద్దెకు తీసుకున్నాడు. జీపీఎస్‌ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్‌ ప్లేట్‌తో చెంగిచెర్లకు వచ్చాడు. డిసెంబర్‌లో చెన్నై వెళ్లి రేవ్‌ కార్స్‌లో చైతన్య ఐడీ కార్డులు పెట్టి స్విఫ్ట్‌ కారును అద్దెకు తీసుకొని ఉడాయించారు. 2021 జనవరిలో మైసూర్‌ వెళ్లి డ్రైవీజీలో సతీష్‌ ఐడీ కార్డులతో బలేనో కారును అద్దెకు తీసుకొని జీపీఎస్‌ ట్రాకర్‌ను తొలగించి నకిలీ నంబర్‌ ప్లేట్‌తో పరారయ్యాడు. అనంతరం కోల్‌కత్తకు వెళ్లి నాగేంద్ర ప్రసాద్‌ ఐడీ కార్డులతో రేవ్‌కార్స్‌లో ఇన్నోవా క్రిస్టా కారును అద్దెకు తీసుకొని జీపీఎస్‌ ట్రాకర్‌ను తొలగించి పరారయ్యాడు. ఓఎల్‌ఎక్స్‌లో డ్రైవర్‌ కావాలని ప్రకటన ఇవ్వడంతో తుఫ్రాన్‌పేట్, చౌటుప్పల్‌ మండల్‌కు చెందిన కిరణ్‌ సంప్రదించగా అతడి ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఐడీ ప్రూఫ్‌లు తీసుకున్నాడు.

జల్సాలు చేసేవాడు
అవి ఎడిట్‌ చేసి 15 రోజుల క్రితం మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో జూమ్‌ కార్స్‌లో ఇచ్చి స్విఫ్ట్‌ కారును చోరీ చేశాడు. చోరీ చేసిన కార్లను 30 నుంచి 40 శాతం ధరకే విక్రయించే వాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు. సమావేశంలో సైబరాబాద్‌ ఇన్‌చార్జి డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్, సీఐలె రవీంద్ర ప్రసాద్, నవీన్‌ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.  

9 కేసుల్లో నిందితుడు
నిందితుడు మహేష్‌ నూతన్‌ కుమార్‌ ఏడు రాష్ట్రాల్లో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మాదాపూర్, మహరాణిపేట, శిల్‌పూర్‌ పీఎస్‌ వెస్ట్‌ బెంగాల్, పాలరివట్టం పీఎస్‌ కొచ్చి, హింజేవాడి పీఎస్‌ పూణె, రాజాజీనగర్‌ పీఎస్‌ బెంగళూర్, అన్నా సాగర్‌ పీఎస్‌ తమిళనాడు, హెబ్బల్‌ పీఎస్‌ మైసూర్, రామమూర్తినగర్, బెంగళూర్‌లలో కేసులు నమోదయ్యాయి. 

ఆరు కేసుల్లో అరెస్ట్‌ 
చోరీల కేసుల్లో మలక్‌పేట్, పాలకోడురు, ఎస్‌ఆర్‌నగర్‌లో మూడు కేసుల్లో, మదివాల, బెంగళూర్‌ పీఎస్‌ పరిధిలోలో ఆరు కేసుల్లో అరెస్ట్‌ అయ్యారు. నిందితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిస్టా, వోక్స్‌వాగన్‌ పోలో, మారుతి బెలేనో, రెండు స్విఫ్ట్‌ కార్లు, వెర్నా కారు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెల్‌ఫోన్లు, ఏడిట్‌ చేసిన ఐడీ కార్డులు, నకిలీ నెంబర్‌ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.  

చదవండి: ఓయో రూమ్‌ తీసుకుందామనుకుంటే.. అంతలోనే!

మరిన్ని వార్తలు