వృద్ధ మహిళలే వారి టార్గెట్‌.. ఒంటరిగా కనపడితే స్కెచ్‌ వేసి..

17 Dec, 2021 17:34 IST|Sakshi

సాక్షి,భీమడోలు(పశ్చిమ గోదావరి): ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలే వారి టార్గెట్‌.. వ్యసనాలకు అలవాటుపడిన ఆ ఇద్దరూ దోపిడీని వృత్తిగా ఎంచుకున్నారు. ఎవరూ లేని సమయంలో వృద్ధ మహిళలపై దాడి చేయడంతోపాటు వారిని హత్యచేసి నగదు, బంగారం ఉడాయించేవారు. ఈ నెల 3వ తేదీన జరిగిన భీమడోలు మండలం గుండుగొలనులో జరిగిన ఒక వృద్ధ మహిళ హత్య కేసును విచారిస్తుండగా.. గతంలో వారు చేసిన మరో మూడు హత్యలు బయటపడ్డాయి. గుండుగొలను హత్యకేసులో వారికి ఒక వ్యక్తి సాయపడగా.. నిందితులు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరును కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారు.  

తీగ లాగితే డొంక కదిలినట్లు.. 
భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్, సీఐ ఎం.సుబ్బారావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుండుగొలనుకు చెందిన దొంగ కృష్ణంరాజు, గంధం పవన్‌కల్యాణ్‌ వ్యసనాలకు డబ్బుల కోసం వృద్ధ మహిళలను టార్గెట్‌ చేసుకుని హత్య చేసేవారు. 2019 జనవరి నుంచి ఇంతవరకూ నలుగురిని హత్య చేశారు. గతంలో జరిగిన మూడు హత్య కేసులు వెలుగులోకి రాలేదు. అయితే గుండుగొలనులో ఈనెల 3న ఉద్దరాజు నాగమణి హత్యకు గురైంది. నాగమణి భర్త చేపల చెరువు వద్దకు వెళ్లాక.. దొంగ కృష్ణంరాజు, గంధం పవన్‌కల్యాణ్‌లు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగుల కొట్టారు.

ఆమె ముఖంపై తలగడతో నొక్కి ఉపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న 34 గ్రాముల బంగారు గొలుసు, సూత్రాలు, ఉంగరం, చెవిదిద్దులు, రూ.4వేల నగదును ఆపహరించుకు పోయారు. ఈ హత్యకు కోరుకల్లు పంచాయతీలోని బద్రికోడుకు చెందిన సీమోన్‌ రాజు పథక రచన చేశాడు. దొంగిలించిన నగల్లో కొన్ని పోడూరు మండలం పండితవిల్లూరుకు చెందిన గెద్దాడ శ్రీనుకు అమ్మారు. ఈ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నేరస్తుల ఆచూకీ కనిపెట్టారు. వారిని విచారించగా కృష్ణంరాజు, పవన్‌కల్యాణ్‌లు గతంలో మరో ముగ్గురు వృద్ధ మహిళల్ని హత్య చేసినట్లు అంగీకరించారు. 

2019 నుంచి హత్యల పరంపర 
2019 జనవరి 5న బద్రికోడుకు చెందిన సాగిరాజు రామసీత(75)ను హత్య చేసి బంగారు చెవి దిద్దులు దొంగిలించారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 3న బద్రికోడుకు చెందిన మంతెన వరహాలమ్మ (72)ను హత్య చేసి 10 కాసుల బంగారు అభరణాలు అపహరించారు. ఈ కేసులో గెద్దాడ శ్రీను ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2021 ఆగస్ట్‌ 27న నిడమర్రు మండలం సిద్ధాపురానికి చెందిన మర్రాపు వరహాలు(70)ను హత్య చేసి 4.5 కాసుల బంగారు అభరణాలు దొంగిలించారు. పాత కేసులకు సంబంధించి వారి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని డీఎస్పీ తెలిపారు.  

మరిన్ని వార్తలు